ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు

పశ్చిమ జోన్ ఏసీపీ దుర్గారావు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ట్రాఫిక్ నిబంధనలు పాటించని టిప్పర్ లారీ డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని పశ్చిమ జోన్ ఏసీపీ దుర్గారావు హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలోని ఫ్లై యాష్ పాండ్ సమీపంలోని టిప్పర్ లారీ ఓనర్స్ సొసైటీ కార్యాలయం వద్ద టిప్పర్ లారీ డ్రైవర్లు, యజమానులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. అధిక వేగంతో ప్రయాణించకుండా వేగ నియంత్రణ పాటించాలన్నారు.

అధిక వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పరిమితికి మించిన లోడుతో రవాణా చేయవద్దని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలను సున్నాకు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన చోదకులు బాధ్యతతో నిబంధనలు పాటించాలని సూచించారు.

సమావేశంలో సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్సై బి.రాజు, టిప్పర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోయ వెంకట్రావు, లారీ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

Leave a Reply