నో హెల్మెట్.. నో ఎంట్రీ

నో హెల్మెట్.. నో ఎంట్రీ
వాహనదారులకు మళ్లీ ఆంక్షలు
హెల్మెట్ ఉంటేనే బ్యారేజీ పైకి అనుమతి
విజయవాడలో మళ్లీ అమల్లోకి
హెల్మెట్ లేనివారికి జరిమానా.. కౌన్సిలింగ్
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంటూ ట్రాఫిక్ పోలీసులు (traffic police) మళ్లీ ఆంక్షలు కఠిన తరం చేశారు. గతంలో హైకోర్టు సూచనలతో విజయవాడ నగరంలో హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు పూర్తిస్థాయిలో అవగాహన, చైతన్యం కల్పించిన పోలీసులు మళ్లీ హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా వసూలు చేశారు.
గత కొంతకాలంగా హెల్మెట్ వాడకం మళ్లీ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అప్రమత్తమైన విజయవాడ (Vijayawada) పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మళ్లీ ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ లను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరవ్యాప్తంగా అన్ని కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులను గుర్తించి వారికి జరిమానా వేయడంతో పాటు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
నో హెల్మెట్ నో ఎంట్రీ…
ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) మీద రాకపోకలు సాగించే వాహనదారులకు హెల్మెట్ ను తప్పనిసరి చేశారు. గడిచిన కొంతకాలంగా ఆంక్షలు లేకపోవడంతో వాహనదారుల్లో సైతం నిర్లప్తత వచ్చి హెల్మెట్లు లేకుండా ప్రయాణాలు ఎక్కువైన పరిస్థితులలో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేనిదే ప్రకాశం బ్యారేజీ మీదకి టు వీలర్స్ ను అనుమతించడం లేదు. శనివారం నుంచి ట్రాఫిక్ సీఐ ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో ప్రకాశం బ్యారేజీ మొదటిలో ఉన్న శనీశ్వర ఆలయం వద్ద ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ ను చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్లే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తేనే బ్యారేజీ మీదికి అనుమతిస్తున్నారు. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఉన్న ప్లే కార్డులను ప్రదర్శిస్తూ, మైకు ద్వారా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
