వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి…

వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి…
రోడ్డు భద్రతకు ఆధునిక పరికరాల పంపిణీ – ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వేసవి తీవ్రత దృష్ట్యా ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బందికి రక్షణ కిట్లు, హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు ఆధునిక పరికరాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ గారు మీడియాతో మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కర్నూలు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ట్రాఫిక్ పోలీసులకు చలువ అద్దాలు, వాటర్ బాటిల్స్, కూల్ వాటర్ క్యాన్స్, టోపీలు, గ్లూకోజ్-డి ప్యాకెట్లు అందజేసినట్లు తెలిపారు.
జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. వేసవిలో ఎండలో గంటల తరబడి విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాల సందర్భంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సత్వర చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (మహబూబ్ నగర్) మరియు కెనరా బ్యాంక్ సహకారంతో హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు రెఫ్లెక్టివ్ (రేడియం) జాకెట్లు, ఇండికేటింగ్ కోన్స్, కంబళ్లు, సుత్తెలు, డ్రాగన్ లైట్లు, లైటింగ్ బాటన్స్ అందజేసినట్లు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రాణ నష్టాన్ని తగ్గించడం, ప్రయాణికుల భద్రతను పెంపొందించడం లక్ష్యంగా గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తూ, హెల్మెట్ వినియోగం ప్రాణాపాయం నుంచి రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్ రావు, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, టూ టౌన్ సీఐ నాగరాజరావు, ట్రాఫిక్ ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ఎన్‌హెచ్ఏఐ సిబ్బంది పాల్గొన్నారు.



