తుమ్మలబైలు నుంచి శ్రీశైలం వైపు 5 కిలోమీటర్ల వరకు నిలిచిన బస్సులు..
నంద్యాల బ్యూరో, మార్చి 21 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్న శ్రీశైలంకు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. శుక్రవారం ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఓవర్ లోడ్ తో వెళ్తున్న లారీ అడ్డంగా నిలిచిపోయిన సంఘటనతో వందలాది వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి.
శ్రీశైలం నుంచి తుమ్మలబైలు వెళ్లే దారిలో అటు ఐదు కిలోమీటర్లు ఇటు 5 కిలోమీటర్లు రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇసుక లోడు లారీ వల్ల ఇరువైపులా వాహనాలు రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అటువైపు ఇటువైపు వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తాగునీరు, ఆహారం లేక అలమటించిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఘాట్ రోడ్డు మలుపు కావడంతో వాహనాన్ని తొలగించేందుకు చాలా శ్రమిస్తున్నారు. లారీని తొలగించాలని ప్రయాణికులు, వృద్ధులు, మహిళలు కోరుతున్నారు. ఐదు గంటల అనంతరం పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
