Traffic | ట్రాఫిక్ మిర్రర్లు…

Traffic | ట్రాఫిక్ మిర్రర్లు…

Traffic | చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలో ని కృష్ణ మహల్ సెంటర్లో ఇటీవల వన్ వే గా ఉన్న జంక్షన్ లో చౌత్ర సెంటర్ నుంచి కృష్ణమహల్ వైపు వచ్చే రోడ్డుకు ఏర్పాటుచేసిన డివైడర్లను ఇటీవల మున్సిపల్ అధికారులు తొలగించడం జరిగింది. దీనితో ట్రాఫిక్కు ఇరువైపులా వాహనాలు ఎదురెదురుగా రావడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. అటువైపు నుంచి వచ్చే ఆటో గాని, ద్విచక్ర వాహనం గాని ఇటువైపు వచ్చే వారికి కనిపించకపోవడంతో రోడ్డు మలుపులో ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది.

అదేవిధంగా సిఆర్ క్లబ్, సింగ్ ఫంక్షన్ హాల్, కృష్ణ మహల్ ఎదురుగా నిత్యం కార్లు పార్కింగ్ చేసి ఉండటంతో, తరచూ ట్రాఫిక్ జామ్ అవడం జరుగుతుంది. డివైడర్లు ఉండటంవల్ల ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది గానీ, డివైడర్లను ఆసరాగా చేసుకొని రోడ్డు ఆక్రమణ చేసుకుంటున్నారని, డివైడర్లు తీసివేయటంతో రోడ్డు ఉపయోగం లోకి వస్తుందన్న స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో డివైడర్లు తీసివేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చునని ప్రజల్లో అభిప్రాయం ఉంది.

వాహనాలు వేగం కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా రెండువైపులా వచ్చే వారికి మూలలు కనపడే విధంగా రోడ్ మలుపులో రెండు వైపులా కనిపించే ట్రాఫిక్ మిర్రర్ లు, రోడ్ పై లో లెవెల్ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, తరచూ రోడ్ మీద వాహనాలు ఆపకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి పరిష్కరించవలసిందిగా స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply