Trade War | అమెరికాకు చైనా మ‌రో షాక్ …. బోయింగ్ విమానాల కొనుగోళ్ల‌కు బ్రేక్

బీజింగ్‌: అమెరికా-చైనాల మధ్య టారిఫ్‌ వార్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే చైనా పలు కీలక ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిలిపివేసింది. ఆ దేశ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం మానేసింది. తాజాగా అమెరికాలోని విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన విమానాల్ని కొనుగోలు చేయొద్దని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆ దేశ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. బ్లూమ్‌బర్గ్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా , చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా, చైనా నుంచి దిగుమతులపై 145 శాతం వరకు టారిఫ్‌లు విధించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం కస్టమ్స్ టారిఫ్‌లు విధించింది. ఈ తరుణంలో చైనా, దేశీయ విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలను కొనుగోలు చేయకుండా ఆదేశించినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. అంతేకాకుండా, అమెరికా నుండి విమాన భాగాలు,ఉపకరణాల కొనుగోళ్లను కూడా నిలిపివేయాలని పేర్కొంది. అదే సమయంలో విమానాల లీజు తీసుకునే సంస్థలకు చైనా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బోయింగ్ సంస్థ నుంచి అత్య‌ధిక విమానాలు కొనుగోలు చేసేది చైనానే.. ఇప్ప‌టికే న‌ష్టాల‌తో ఉన్న బోయింగ్ కంపెనీకి చైనా నిర్ణ‌యంలో మ‌రిన్ని న‌ష్టాలు వ‌స్తాయ‌ని అంటున్నారు.. ట్రంప్ త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోకుంటే బోయింగ్ మూత ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని భ‌య‌ప‌డుతున్నారు.

ఇక ట్రంప్ విధించిన టారిఫ్‌లు ప్రపంచ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టేశాయి. మిత్రదేశాలు, ప్రత్యర్థులతో కూడిన సంబంధాలపై ప్రభావం చూపించాయి. గత వారం ట్రంప్, కొత్త టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేశానని ప్రకటించినా, చైనాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అమెరికా అధికారులు ఇటీవల స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు,సెమీకండక్టర్లు వంటి హైటెక్ ఉత్పత్తులపై టారిఫ్ మినహాయింపులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *