TPTF | తక్షణమే రద్దు చేయాలి…

TPTF | తక్షణమే రద్దు చేయాలి…
Mulugu | ఏటూరునాగారం, ఆంధ్ర ప్రభ : ములుగు జిల్లా విద్యాశాఖలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కో ఆర్డినేటర్-2(Coordinator-2) (అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ – ఏఎంఓ) నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి(District Education Officer) (DEO) అక్టోబర్ 10వ తేదీన ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఆ సమావేశంలో కోర్డినేటర్-2 పోస్టు భర్తీ విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని సంఘాల బాధ్యులు స్పష్టం చేశారు. ముందుగా గెజిటెడ్(Gazetted) ప్రధానోపాధ్యాయులకు అవకాశం కల్పించాలని, వారు ముందుకు రాని పక్షంలో దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్(School Assistant)లలో సీనియార్టీ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని సంఘాలు ఏకగ్రీవంగా సూచించాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకుల సూచనలను పూర్తిగా పక్కన పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా విద్యాశాఖ కోర్డినేటర్-2 నియామకాన్ని పూర్తి చేసిందని పల్లె నాగరాజు ఆరోపించారు. ”ఇది ఉపాధ్యాయ సంఘాల నాయకులను, వారి సూచనలను అవమానించడమే అవుతుంది.
ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన చర్చను, తీసుకున్న నిర్ణయాలను విస్మరించడం సరైన పద్ధతి కాదు,” అని పల్లె నాగరాజు(Nagaraju) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే ఈ నియామకాన్ని రద్దు చేయాలని, తిరిగి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించి, అందరి నిర్ణయం మేరకు మాత్రమే కోర్డినేటర్-2 నియామకంపై తుది నిర్ణయం తీసుకోవాలని టీపీటీఎఫ్(TPTF) జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.
