తొలకరికి ముందే మురిపించిన వరుణుడు
16 ఏండ్ల రికార్డు బ్రేక్ చేస్తూ ముందే వానలు
మే చివరి వారంలో దంచికొట్టిన వర్షం
ఆ తర్వాత ఆడపాదడపా చినుకులే
నారుమళ్లు కాపాడేందుకు రైతుల తంటాలు
బిందెలతో నీరు తోడిపోస్తున్న మహిళలు
గోదారి, కృష్ణా నదుల్లో పెద్ద ఎత్తున ప్రవాహం
ఎత్తిపోతల ఊసే లేదు.. కాలువల్లో పారని నీళ్లు
మందకోడిగా వరి నాట్లు.. పత్తి, మిర్చి, జొన్న రైతుల పరేషాన్
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
తెలంగాణాలో ఈ సారి వానాకాలం సాగు ఒక అడుగు ముందుకు.. రెండగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. ఏరువాక మందగించింది. నైరుతి రుతుపవనాల రాకతో సమృద్ధిగానే వర్షపాతం నమోదవుతుందని అంచనా ఉంది. జూన్ మొదటి, రెండు వారాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ, ఈసారి రుతుపవనాలు అంచనా కంటే ముందే వచ్చేశాయి. ఉత్తర తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ తెలంగాణాలోని నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎడతెరిపి లేని వాన పడింది. కానీ , ఇప్పుడు అసలు సీజన్‌లో వర్షపాతం తగ్గింది.
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. ఈ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నీటిపారుదల ఆలస్యం కావడంతో వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో విత్తనాలు నాటే ప్రక్రియ మందగమనంతో సాగుతోంది. ఇప్పటికైతే రాష్ట్రంలో 42.5 శాతం మాత్రమే పంటలు సాగు చేశారు. ఇకమీదట వర్షాలు పడకపోతే మొక్క దశలోనే పత్తి, మిర్చి మక్కజొన్న మొక్కలు ఎండిపోతాయి. వరి సాగు కూడా ప్రమాదంలో పడుతుందని రైతులు అంటున్నారు.
ముందే మురిపించిన వాన..
ఇప్పటి వరకు సాధారణ సాగు విస్తీర్ణంలో 42.48 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. తెలంగాణలో సాధారణ సాగు విస్తీర్ణం 132.44 లక్షల ఎకరాలు కాగా, కేవలం 56.26 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి, గత ఏడాదితో పోలిస్తే ఇదే కాలంలో 56.19 లక్షల ఎకరాల కంటే ఇది స్వల్పంగా ఎక్కువ. అదీ ముందస్తుగా వానలు కురవటంతో ఈ విస్తీర్ణం నమోదైంది. గత సంవత్సరం 218.9 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఈసారి 165.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు వర్షపాతం 186.4 మి.మీ. కంటే -11 శాతం తగ్గింది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరద పరవళ్లు తొక్కుతున్నా.. వివిధ ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోసే అంశాన్ని ప్రభుత్వం ఇంకా పరిశీలించకడం లేదు. నీటి ఎత్తిపోతలలో ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే సాగు పరిస్థితి మరింత దిగజారిందనేది ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
కోటి ఎకరాల సాగు.. ఊరింతేనా?
పత్తి, మొక్కజొన్న, మిరప, సోయాబీన్, బఠానీ, జొన్న సాగును వర్షాకాలానికి పరిమితం చేయడంతో వర్షాధార పంటల విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది. జూన్ చివరిలో, జులై ప్రారంభంలో కురిసిన వర్షాలు పంట పరిస్థితులను స్వల్పంగా మెరుగుపరిచినప్పటికీ, రాబోయే పక్షం రోజుల్లో రాష్ట్రంలో మంచి వర్షాలు కురవకపోతే ఇప్పటికే విత్తిన పత్తి, మిరప, జొన్న వంటి పంటలు కోలుకోలేని నష్టాన్ని చవిచూడక తప్పదని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నారుమడి నుంచి నాట్లు వేసే దశలో వరి సాగు ఉండగా, పప్పు ధాన్యాల విత్తనాలు విత్తుతున్నారు. పత్తి సాగు మొలక దశలో ఉంది. 36.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోంది. గత సంవత్సరం 35.71 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. గతంతో పోలిస్తే కాస్త ఎక్కువే. మొక్కజొన్న 2.45 లక్షల ఎకరాల నుంచి 5.34 లక్షల ఎకరాలకు పెరిగింది. వరి సాధారణ విస్తీర్ణం 62.47 లక్షల ఎకరాలు. ఇప్పటికీ 5.01 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. రాబోయే రెండు వారాలు చాలా కీలకం. వర్షాలు కురవకపోతే, కోటి ఎకరాల సాగు విస్తీర్ణ లక్ష్యం కుంటుపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆదుకోని మేడిగడ్డ..
16 లక్షల ఎకరాల్లో సాగు కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఎత్తిపోతల మేడిగడ్డ ప్రాజెక్టు ఏడాదిన్నరగా మూలపడింది. తక్షణం మరమ్మతులకు ప్రభుత్వం కరణకటాక్షాలు లేవు. కళ్ల ముందే వందల టీఎంసీలు గోదారి దిగువకు పరుగులు తీస్తున్నాయి. దిగువన పట్టిసీమ నుంచి ఏపీ సర్కారు గోదావరి నీటిని కృష్ణానదిలో కలుపుతుంటే.. మేడిగడ్డ ఎత్తిపోతల రైతులు దీనంగా ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం పేచీ తెగేదెప్పుడు? మేడిగడ్డ జబ్బు నయం చేసేదెప్పుడు? అని తెలంగాణ రైతన్న కన్నీళ్లు దిగమింగుతున్నాడు.