Top Story | మిస్ట‌రీ డెత్స్‌! ఒక హ‌త్య‌.. ఆరు మరణాలు

వివేకా మ‌ర్డ‌ర్‌ కేసులో తెలివిమీరిన దోషులు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి చిక్క‌కుండా ఎత్తులు
వ‌రుస‌గా మాయం అవుతున్న కీల‌క సాక్షులు
సినిమా డ్రామాను త‌ల‌పిస్తున్న‌ పొలిటికల్ కస్టడీ
ఆరేండ్లుగా కొన‌సాగుతున్న వివేకా మర్డర్ మిస్టరీ
విచారణలో సిట్‌కు అంతుచిక్క‌ని తీరు
ఇప్పటికే ఆరుగురు సాక్షులు దుర్మ‌ర‌ణం
కీలక సాక్షి మరణం కూడా అనుమానాస్పదమే
ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న అప్రూవ‌ర్‌
సాక్షులంతా ఒకే తర‌హాలో చ‌నిపోతుండ‌డంపై అనుమానాలు
స్లో పాయిజ‌న్‌కు గుర‌వుతున్నారా? స‌హ‌జ మ‌ర‌ణాలా?
సీబీఐ విచార‌ణ కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించిన సునీతా

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌:

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి స్వ‌యానా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి సోద‌రుడు.. అంతేకాకుండా మ‌రో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు స్వ‌యానా బాబాయి అవుతారు. అట్లాంటి వ్య‌క్తి హ‌త్య‌కు గుర‌వ్వ‌డం.. అత‌ని కేసులో అస‌లు నిందితులెవ‌రో తెలియ‌కుండా పోవ‌డం అంతా సస్పెన్స్ డ్రామాను త‌ల‌పిస్తోంది. ఇక ఇదే కేసులో కీల‌క సాక్షులంతా వ‌రుస‌గా చ‌నిపోతుండ‌డ‌మూ అనుమానాల‌కు తావిస్తోంది. అదికూడా ఒకే త‌ర‌హాలో కీలక సాక్షులు చ‌నిపోవ‌డంపై యావ‌త్ ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇదేంటి.. స్లో పాయిజ‌న్ ఏమైనా జ‌రిగిందా? లేక అంతుచిక్క‌ని ఈ మ‌ర‌ణాలకు కార‌ణ‌మేంట‌నే దానిపై అంద‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొంది. దీనిపై సిట్ ద‌ర్యాప్తు చేప‌ట్ట‌డంతో ఈ విష‌యం కాస్త మ‌ళ్లీ చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది.

వాచ్‌మెన్ రంగ‌న్న డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం..

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక ప్రత్యక్ష సాక్షి.. వాచ్ మెన్ రంగన్న అనుమానాస్పద మరణంపై సిట్ దర్యాప్తు చేప‌ట్టింది. కేసు తీవ్రత దృష్ట్యా శ్మశాన వాటికలో ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని వెలికితీసీ రీ పోస్టుమార్టం నిర్వహించారు. రంగన్న శరీరం నుంచి 20 రకాల ముఖ్యమైన అవయవాలను సేకరించారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, జీర్ణక్రియకు సంబంధించిన అవయవాలు, మెదడులోని భాగాలు, కాలి, చేతి గోళ్లు, తల వెంట్రుకలు, లాలాజలం వంటి 20 రకాల అవయవాలను సేకరించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచారు. రంగన్న చనిపోవడానికి స్లో పాయిజన్ ఏమైనా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయడానికి కావాల్సిన అవయవాలను ఆయన శరీరం నుంచి సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. లాలాజలం, తల వెంట్రుకలు, చేతి గోళ్లు, కొన్ని ఎముకల్లో ఆలస్యంగా స్లో పాయిజన్ ప్రభావం కనిపిస్తుందని డాక్ట‌ర్లు చెబుతున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రంగన్న రెండేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన వాడిన మందులు, ఔషధాలను పోలీసులు సీజ్‌ చేశారు. వాటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

రంగ‌న్న మృతికి కార‌ణాల అన్వేష‌ణ‌..

ప్ర‌ధాని సాక్షిగా ఉన్న రంగన్న వాడుతున్న సెల్ ఫోన్‌తోపాటు కాల్ డేటా వివరాలు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల నివాసం ఉన్న స్థానికుల కాల్ డేటాను సిట్‌ సేకరిస్తోంది. రంగన్నకు నాలుగేళ్ల నుంచి ఇంటివద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసుల వివరాలు, చనిపోవడానికి నెలరోజుల ముందు నుంచి బందోబస్తులో ఉన్న పోలీసుల కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. రంగన్నఎక్కడెక్కిడికి వెళ్లాడు? వారి కుటుంబ సభ్యులు ఎవరెవరితో మాట్లాడారు అనే దానిపైనా ఆరా తీస్తున్నారు. సాంకేతికంగా రంగన్న ఇంటి పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి నుంచి రంగన్న కుటుంబ సభ్యులకు ఫోన్లు వెళ్లాయా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. వివేకా కేసులో బెయిల్‌పై విడుదలై పులివెందులలో తిరుగుతున్న నిందితుల కదలికలపైన నిఘా పెట్టారు. రంగన్న చనిపోయే రోజు భార్య సుశీలమ్మ బయటి హోటల్ నుంచి టిఫిన్ తెప్పించి పెట్టింది. టిఫిన్ తిన్న తర్వాతనే రంగన్న అస్వస్తతకు గురయ్యాడు. రంగన్నకు ఏ హోటల్ నుంచి టిఫిన్ తెచ్చారనే వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు.

అభిషేక్ రెడ్డి అనూహ్య మరణం

మరో సాక్షి డాక్టర్ వైఎస్‌ అభిషేక్‌రెడ్డి(36) వివేకాది హత్యేనని వాంగ్మూలమిచ్చిన కొన్నాళ్లకి 2025 జనవరి 10వ తేదీన మృతి చెందారు. వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో అభిషేక్‌రెడ్డి ఉన్నారు. వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకరరెడ్డి నుంచి తనకు ఫోన్‌కాల్‌ వచ్చిందని, ఘటనాస్థలానికి వెళ్లి చూడగా మృతదేహం చుట్టూ రక్తం, ఆయన నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించి, ఇది హత్యేనని భావించానంటూ 2021 ఆగస్టులో అభిషేక్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. అవినాష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకరరెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డే వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో తెలిపారు. స్వతహాగా డాక్ట‌ర్‌, యువకుడైన అభిషేక్‌రెడ్డి ఈ వాంగ్మూలం వెలుగుచూసిన కొన్నేళ్లకే అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరి 10వ తేదీన చ‌నిపోవ‌డం అనుమానాస్ప‌దంగా మారింది.

ఇటు సీబీఐ తనిఖీలు.. అటు సాక్షి మృతి

జగన్‌ క్యాంపు కార్యాలయంలో సీబీఐ తనిఖీ చేసిన కొద్ది రోజుల్లోనే వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి (40), 2022 జూన్‌ 9వ తేదీన చ‌నిపోయాడు. గంగాధర్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందార‌ని అప్పట్లో ప్రచారం జ‌రిగింది. ఆయన మరణం కూడా అనేక సందేహాలకు తావిచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ బృందాలు పులివెందులలోని జగన్‌ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, అవినాష్‌రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ పరిసరాల్లో కొలతలు, గూగుల్‌ కోఆర్డినేట్స్‌ తీసుకున్నాయి. తనిఖీలు జరిగిన వెంటనే ఈ కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మ‌ర‌ణించ‌డమూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈసీ గంగిరెడ్డి మృతి

వివేకా మృతదేహానికి హాస్పిటల్ సిబ్బందితో గంగిరెడ్డి కట్లు కట్టించారు. వైఎస్‌ భారతి తండ్రి, జగన్‌ మామ ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరు 3వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు. గంగిరెడ్డి మృతి సైతం అనుమానాస్పదంగానే ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

డ్రైవరు నారాయణ మరణ కథ..

వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిని హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్‌ నారాయణ యాదవ్‌ 2019 డిసెంబరు 6వ తేదీన చ‌నిపోయారు. అనారోగ్య కారణాలతోనే నారాయణయాదవ్‌ చనిపోయార‌ని అప్పట్లో ప్రచారం జరిగింది. హైదరాబాద్‌- పులివెందుల ప్రయాణంలో జగన్, భారతి, అవినాష్‌రెడ్డి, ఇతరుల మధ్య వివేకా మరణానికి సంబంధించి ఫోన్‌ సంభాషణలు జరిగాయని, అవన్నీ నారాయణయాదవ్‌ విన్నారన్న ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన‌ కీలక సాక్షిగా ఉండటంతో, విచారణకు పిలవకముందే నారాయణయాదవ్ చనిపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కటికరెడ్డి శ్రీ‌నివాసుల‌రెడ్డి ఆత్మహత్య..

వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరు 3వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషపుగుళికలు తీసుకుని, శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య చేసుకున్నార‌ని అప్పట్లో ప్రచారం చేశారు. శ్రీనివాసులరెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి. నార్కోఎనాలసిస్‌ పరీక్షలకు హాజరై తిరిగొచ్చిన కొద్దిరోజుల్లోనే కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరణించారు.

విచార‌ణ ముందుకు సాగ‌కుండా..

సీబీఐ కంటే ముందు రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని ఏర్పాటుచేసిన సిట్‌ ఈ కేసులో కీలక వ్యక్తుల్ని విచారిస్తున్న సమయంలో శ్రీనివాసులరెడ్డి మృతి చెందారు. తన చావుకు సిట్‌లోని ఇన్‌స్పెక్టర్‌ కారణమ‌ని.. అప్ప‌టి సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి శ్రీనివాసులరెడ్డి రాసిన‌ట్టు రెండు లేఖల్ని అప్పట్లో ఆయన కుటుంబసభ్యుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివేకా హత్య కేసులో అనుమానితులను సిట్‌ ఇన్‌స్పెక్టర్‌ లోతుగా విచారిస్తున్న సమయంలో, దాన్ని నిరోధించడానికే ఇలా చేశారనే అనుమానాలున్నాయి. మరోవైపు కేసు విచారణ సీబీఐ కోర్టులో త్వరగా ప్రారంభించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సునీత తెలంగాణ హైకోర్టును ఇటీవలే ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *