విలయాలకు విలవిడుతున్న బ్యాంకాక్
సునామీ వేళ 5187 మంది మృతి
వీరిలో 2463 మంది విదేశీయులే
సాగరుడి దెబ్బతో కోలుకున్నా.. భూ విలయంతో మళ్లీ కుదేలు
సహాయక చర్యల్లో ప్రపంచం బిజీబిజీ
ఆపరేషన్ బ్రహ్మతో కదిలిన భారత్
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపం ప్రపంచ దేశాలను కుదిపేసింది. కళ్ల ముందే కుప్పకూలిన ఆకాశహార్మ్యాల విధ్వంస దృశ్యాలతో అంతా తల్లడిల్లిపోయారు. చావు బతుకులాటలో ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీస్తున్న జనాన్ని చూసి అల్లాడిపోయారు. ప్రపంచ దేశాలన్నీ పత్యక్ష సాక్షిలా టీవీల ముందు మూగబోయాయి. అయ్యో బ్యాంకాక్.. ఇలా శిథిలమైందని చాలామంది హతాశులయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే విగత జీవుల లెక్క తేలుతుంటే.. ప్రపంచం కన్నీరు పెడుతోంది.
శిథిల భవనాల కింద ఆర్తనాదాలు..
21 ఏళ్ల కిందట సునామీ రూపంలో సాగరం విరుచుకుపడితే… ఇప్పుడు భూతల్లి గర్భం ముక్కలైంది. ఒక్క థాయ్‌లాండ్‌లోనే 5400 మంది సాగర గర్భంలో ఊపిరి వదిలారు. ఇందులో 2000 మంది విదేశీయులు విగతజీవులయ్యారు. ఇక తాజా భూకంపంలో ఇప్పటికీ థాయ్‌లాండ్, మమన్మార్ దేశాల్లో మృతుల సంఖ్య వేలకు చేరుకుంది. ఈ సంఖ్య 10 వేలకు పైగానే ఉంటుందని అంచనాలున్నాయి. థాయ్‌లో వేలాది బహుళ అంతస్తుల భవనాలు పేక మేడల్లా కుప్ప కూలాయి. ఎక్కడ చూసినా భవనాలు శిథిలాల గుట్టలతో మయన్మార్ మరుభూమిని తలపిస్తోంది. ఇప్పటిదాక ఒక్క మయన్మార్‌లోనే 1002మంది మరణించినట్లుగా, 2370మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. థాయ్‌లాండ్‌లో ఇప్పటిదాక 22మంది చనిపోగా, ఓ నిర్మాణ భవనం కూలిన ఘటనలో బ్యాంకాక్‌లో 100మంది గల్లంతయ్యారు. రెండు దేశాల్లో కలిపి భూకంప మృతుల సంఖ్య 10వేలు దాటవచ్చని అంచనా. శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది ఆర్తనాదాలు చేస్తున్నారు.
భారత్ ఆపరేషన్ బ్రహ్మ..
భూ విలయంలో విధ్వంసమైన మయన్మార్, థాయ్ లాండ్ లను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు కదిలాయి. ఇప్పటికే భారత్.. ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. అటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా రంగంలోకి దిగాయి. భూకంప బాధిత దేశాలకు సహాయక సామగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు.
14 దీవులను కుదిపేసిన సునామీ..
అది 2004 డిసెంబర్ 26. ఉదయం 7.30 గంటలకు 2004 హిందూ మహాసముద్రంలో భూకంపం కుదిపేసింది. సముద్రం సునామీగా మారిపోయింది. 14 దేశాలను కుదిపేసింది. ఇందులో థాయిలాండ్ కూడా బాధిత దేశమే. థాయిలాండ్‌లోని ఆరు ప్రావిన్సులలో అపార నష్టం. విధ్వంసం సర్వ వినాశనం సృష్టించింది. 407 గ్రామాలపై ప్రభావితం చేసింది. ప్రముఖ పర్యాటక కేంద్రం ఖావో లక్ సహా 47దీవుల్ని ముంచేసింది.
14 దేశాల్లో 2.30 లక్షల ప్రాణ నష్టం
భూకంపించిన 20 నిమిషాల్లోనే ఇండోనేషియా, భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల తీరాలను, ఏడు గంటల వ్యవధిలో ఆఫ్రికాలోని సోమాలియా ఈశాన్య తీరాన్ని సునామీ తాకింది. రాయల్ థాయ్ ప్రభుత్వం లెక్కల ప్రకారం 5,187 మంది సునామీలో మరణించారు. వీరిలో 2,463 మంది విదేశీయులు ఉన్నారు. 78 శాతం మంది ఫాంగ్ న్గ్ ప్రావిన్స్‌లోనే చనిపోయారు. 8,457 మంది గాయపడ్డారు. ఈ 14దేశాల్లో 2లక్షల 30వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. 2004 మార్కెట్ విలువ 1300 కోట్ల అమెరికన్ డాలర్లు (58,630 నష్టం వాటిల్లింది. ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఈ నష్టం 1,11,226 కోట్లు. వీటిలో అత్యధిక భాగం బీమా చేయలేదు.
అలా కోలుకుని.. ఇలా విధ్వంసం..
సునామీ మెరుపుదాడితో భంగపడిన పర్యాటకుల స్వర్గధామం..బ్యాంకాక్ ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని దిగమింగినా.. అనతి కాలంలోనే కోలుకుంది. తనకున్న పర్యాటక శక్తితో అభివృద్దివైపు పరుగులు తీసింది. ఆదాయంలో ఎక్కడా తగ్గలేదు. ప్రపంచం నలమూలల నుంచి పర్యాటకులు బ్యాంకాక్ లో బారులు తీరారు. దీనికి కారణం.. పర్యాటకులను అన్నివిధాల ఆకర్షించింది. కానీ, ఇప్పుడు మళ్లీ భూ విలయంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. కోట్ల బాట్ల వర్షం కురిపించిన ఆతిథ్య రంగంలోని ఆకాశ హార్మ్యాలు కుప్పకూలాయి. దేశమే విధ్వంసమైంది. ఇక కోలుకోవాలంటే.. వందేళ్లు పడుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మమన్మార్.. పరిస్థితి వర్ణననాతీతం. అంతర్గత రాజకీయ రగడ. హింసతో అల్లాడుతున్న ఈ దేశాన్ని అన్నిరంగాల్లోనూ భూకంపం సర్వనాశనం చేసింది. ప్రపంచ దేశాల జాలి, దయతో కొనఊపిరి స్థితి నుంచి కోలుకోవటానికి దశాబ్ధాల కాలం పడుతుందని పరిశీలకలులు చెబుతున్నారు.