Top Story | అవినీతి చిట్టా.. అక్రమాల పుట్ట: గురుశిష్యుల అరాచకాలకు అంతేలేదంటూ ఆగ్రహం

ఆంధ్రప్రభ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం – పినపాక నియోజకవర్గం పరిధిలోని మణుగూరు కేంద్రంగా అవినీతికి ఆనవాలుగా మారిన గురుశిష్యులు సాగించిన పాపాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. మాజీ జడ్పీటీసీతో పాటు, పార్టీ పదవిలో కొనసాగిన ఆయన శిష్యుడు మండలంలో చేయని అరాచకం లేదని పలువురు బాధితులు వాపోతున్నారు. ఆంధ్రప్రభ కథనాలకు మరింత బలం చేకూర్చేలా వందలాది మంది ఫోన్లు చేస్తూ, వారి అక్రమాల గుట్టు విప్పుతున్నారు. ఇప్పటి వరకు కేవలం భూ సంబంధిత వ్యవహారాల్లో తలదూర్చి, కాసులు పోగేసు కున్నారని మాత్రమే భావిస్తుండగా, అంతకు రెట్టింపు మొత్తాలను ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆశజూపి, దండుకున్నట్లు వారిరువురిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులైన పేదలను ఆర్థికంగా ఆదుకోవాలన్న సదుద్దేశంతో నాటి ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, జాబితాలో చేరుస్తామంటూ లక్షల రూపాయలను వారు కాజేసినట్లు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలతో పాటు ఇనాం భూముల్లోనూ పాగా వేయడం, తద్వారా సెటిల్‌మెంట్‌ చేయడం ద్వారా వీరు కాజేసిన మొత్తం అక్షరాల రూ.50కోట్ల పైచిలుకే ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇంటెలిజెన్స్‌ వర్గాల ఆరా.!

అవినీతితో అంటకాగుతూ, అరాచకాలకు మారుపేరుగా మారిన మాజీ జడ్పీటీసీ, ఆయన శిష్యుడు ఇరువురూ సాగించిన అక్రమాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆంధ్రప్రభతో పాటు, మీడియ ప్రతినిధులకు ఫోన్‌ చేసి వారి వివరాలను సేకరించినట్లు సమాచారం. అంతేకాకుండా వీరి హయాంలో జరిగిన భూ లావాదేవీలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను సైతం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వీరు సాగించిన లావాదేవీలపై కూపీ లాగనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా ప రి గణిస్తున్నట్లు తెలుస్తోంది.

సిట్‌ విచారణకు బాధితుల డిమాండ్‌

పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరును అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చిన గురు శిష్యులు సాగించిన అక్రమాలపై సిట్‌ వేసి విచారణ జరిపించాలని పలువురు బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయాల్సిన ఆ నాయకులు, అప్పనంగా వచ్చే మేతకు అలవాటుపడి ప్రభుత్వ భూములను తెగనమ్మడం ద్వారా కోట్లకు పడగలెత్తినట్లు విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చిన్నా చితకా సమస్యలపై ఉద్యమాలకు ఊపిరి పోసినట్లుండే ఎర్రజెండా పార్టీలు సైతం ఈ గురుశిష్యుల అక్రమ వ్యవహారాలపై నోరు మెదపడం లేదని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు సాగించిన అక్రమాలపై విచారణ జరపడంతో పాటు, మరొకరు ఇలా అవినీతికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Leave a Reply