Top Story – వైసిపి కోటలో లిక్కర్ బాంబు … వరుస అరెస్ట్ లతో ఉక్కిరి బిక్కిరి

ఐపీఎస్ పీఎస్​ఆర్​ అరెస్టు
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిందితుడు
హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు
గతంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ గా పనిచేసిన పీఎస్సార్
ప్రస్తుతం సస్పెన్షన్​లో ఉన్న ఆంజనేయులు
కేసులు వెంటాడుతున్నా బెయిల్ కోరని ఆఫీసర్
జత్వానీ కేసులో పూర్తి స్థాయిలో విచారించనున్న సీఐడీ

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే.. కనిపించని నాలుగో సింహమే పోలీస్.. ఇదీ 29 ఏళ్ల కిందటి సినీ డైలాగ్ సమాజంలో పోలీస్ వృత్తిని కీర్తించింది. ప్రస్తుతం సెపరేటు రూటులోకి మారింది. రాజకీయ నేతల పరదాల్లో పోలీసు అధికారి చిక్కితే.. ఏమి జరుగుతుందో.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు.. రౌడీలకు సింహస్వప్నం.. నేరగాళ్లకు యముడిగా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి భుజంపై స్టార్ల‌కు నేడు అవినీతికి, అన్యాయానికి, అధర్మానికి ప్రతిబింబం అనే మకిలతో మసకబారాయి. గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌గా ఆయన పనిచేశారు. ప్రస్తుతం ముంబై నటి జత్వాని కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో కూడా ఆయనే నిందితుడు. ఈ కేసులు తనను వెంటాడుతున్నాయని గ్రహించినా.. ఆయన ఇప్పటి వరకూ ముందస్తు బెయిల్‌ కోసం న్యాయస్థానం తలుపులు తట్టలేదు. మెట్లు ఎక్కలేదు.

కాదంబరీ ఫస్ట్ సీక్వెల్..
వైసీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసిన సంఘటన ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై జత్వాని కేసు వేయడంతోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారనే ఆరోప‌ణలు వచ్చాయి. ఈ కేసును వాపస్ తీసుకోవాలని జత్వానీపై తీవ్ర ఒత్తిడికి గురిచేశారనే విమ‌ర్శ‌లు తెరమీదకు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలోని ఓ గెస్ట్ హౌస్ లో నిర్బంధించారని ప్రచారం జరిగింది.

ఇక కాదంబరీ- 2
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాదంబరీ సీక్వెల్ 2 తెరమీదకు వచ్చింది. తనపై తప్పుడు కేసు పెట్టి తనతోపాటు తన తల్లిదండ్రులను జైలు పాల్జేశారని ముంబై నటి పోలీసులపై, కుక్కల విద్యాసాగర్‌పై 2024 ఆగస్టులో కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదుపై విద్యాసాగర్‌తో పాటు ముగ్గురు ఐపీఎస్‌లపై విజయవాడలో కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ1గా విద్యాసాగర్, ఏ2గా పి.సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్‌), ఏ3గా కాంతిరాణా, ఏ4గా అప్పటి వెస్ట్‌జోన్‌ ఏసీపీ హనుమంతురావు, ఏ5గా ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్‌గున్నీ పేర్లను పోలీసులు చేర్చారు. విద్యాసాగర్‌తో అధికారులు పి.సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్‌గున్నీ వైస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో కుమ్మక్కై కాదంబరీ జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును కూటమి సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. జత్వానీ విషయంలో ఈ ముగ్గురి పాత్ర ఉందని తెలియడంతో విజయవాడ మాజీ సీపీ కాంతి రాణాటాటా, ఐపీఎస్ విశాల్ గున్ని సహా.. పీఎస్‌ఆర్ ఆంజనేయలుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను 2025 సెప్టెంబర్ 25వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు

క్లైమాక్స్‌లో పీఎస్ఆర్ అరెస్ట్
తన ఆస్తిపై జత్వానీ తప్పుడు ఒప్పంద పత్రాన్ని సృష్టించి, ఇతరులకు విక్రయించినట్లు 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం ఠాణాలో విద్యాసాగర్‌ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు పెట్టారు. అయితే ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా సీతారామాంజనేయులుగా పోలీసులు నిర్ధారించారు. ముఖ్య నేత చెప్పగానే రంగంలోకి దిగిన పీఎస్‌ఆర్‌… కాదంబరిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలో ఆయనే చూసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో పీఎస్‌ఆర్‌తో పాటు కాంతిరాణా, విశాల్‌ గున్నీ, స్థానిక దర్యాప్తు అధికారి వరకూ అందరిపైనా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది.

అరెస్టు చేశారిలా..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పీఎస్‌ఆర్‌ ఇంటి వద్ద సోమవారం సీఐడీ పోలీసులు పరిశీలించారు. దీన్ని గమనించిన పీఎస్‌ఆర్‌ బేగంపేటలోని ఆయన వియ్యంకుడి ఇంటికెళ్లారు. ఉదయం 5 గంటలకు ఆంజనేయులును సీఐడీ అరెస్టు చేసింది. అక్కడి నుంచి మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు పీఎస్‌ఆర్‌ను తీసుకెళ్లి సోదాలు నిర్వహించారు. తదనంతరం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సీతారామాంజనేయులును ఏపీకి తరలించారు. ఈ కేసులో ఆయన్ను పూర్తి స్థాయిలో సీఐడీ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్​ చేశారు. విజయవాడ మాజీ సీపీ కాంతిరాణాటాటా, ఐపీఎస్ విశాల్ గున్నితో పాటు ఆంజనేయలు సస్పెన్షన్‌లో ఉన్నారు.

Leave a Reply