Curry leaves | కరివేపాకా.. మజాకా..

Curry leaves | కరివేపాకా.. మజాకా..
ఆంధ్రప్రభ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది పెద్దల మాట. మన వంటగదిలో కనిపంచే ఆకుకూరల్లో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో ‘కరివేపాకు’ అగ్రశ్రేణికి చెందుతుంది. కానీ, మన నిత్య జీవితంలో జీవితంలో ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాలన్నా లేదా ఒకరి ప్రాధాన్యతను తగ్గించాలన్నా “కూరలో కరివేపాకు” అనే మాటను ఒక సామెతలా వాడుతుంటాం. అంటే, పని పూర్తయ్యాక విసిరి పక్కన పారేస్తారని..
సాధారణంగా మనం కూరల్లో కూడా కరివేపాకు కనిపిస్తే దానిని తీసి పక్కన పెడుతుంటాం. కానీ, అసలు నిజం ఏంటంటే.. వంటలో కరివేపాకు పడకపోతే రుచి రాదు, గుమగుమ ఉండదు. ఆ చిన్న ఆకులో దాగున్న పోషక విలువలు తెలిస్తే మాత్రం మీరు ఎప్పటికీ ఈ తప్పు ఎప్పటికీ చేయరు. కేవలం రుచి కోసం, సువాసన కోసం మాత్రమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యానికి, ముఖ్యంగా కేశ సౌందర్యానికి కరివేపాకు ఒక వరప్రసాదం అంటే నమ్ముతారా..
అవును, జుట్టు రాలడం నుండి జీర్ణక్రియ సమస్యల వరకు కరివేపాకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా కరివేపాకుకు విశిష్టమైన స్థానం ఉంది. కరివేపాకులోని పోషక గుణాలు, జుట్టుకు కలిగే ప్రయోజనాలు, దానిని వాడే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వంటల్లో కరివేపాకును కేవలం గార్నిషింగ్ కోసమే కాదు.. ప్రతి వంటలో దీనిని చేర్చడానికి ప్రధాన కారణం దానిలోని జీర్ణక్రియ సామర్థ్యం అని కూడా చెప్పుకోవచ్చు. కరివేపాకులో ఉండే ఎంజైమ్‌లు మనం తిన్న ఆహారం త్వరగా అరగడానికి సహాయపడతాయి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దరిచేరనీయవు.
ఇది కూడా చదవండి : Rare 5 syndromes | అరుదైన వ్యాధులు…
Curry leaves | కరివేపాకులోని పోషక రహస్యాలు…
కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ లతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కరివేపాకులోని అమినో యాసిడ్స్ జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి, జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దానికి తోడు చుండ్రు.
అయితే, కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కాల్ప్‌పై రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని కారణంగా జుట్టు మూలాలకు (hair roots) కావాల్సిన పోషణ అందుతుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే బీటా కెరోటిన్, ప్రొటీన్లు జుట్టు చిట్లిపోకుండా (split ends) కాపాడతాయి.
ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారికి కరివేపాకు ఒక సహజమైన మందులా పనిచేస్తుంది. ఇది జుట్టులోని మెలనిన్ ఉత్పత్తిని పెంచి, జుట్టు సహజంగా నల్లబడటానికి సహాయపడుతుంది. మెంతులు, ఉసిరి పొడితో కలిపి కరివేపాకును వాడటం వల్ల జుట్టు మరింత ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

అలాగే, నేటి కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. కరివేపాకులో ఉండే విటమిన్-ఎ కంటి రెటినాను సంరక్షించడమే కాకుండా, రేచీకటి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
అలాగే, చక్కెర వ్యాధి (Diabetes)తో భాద పడే వారికి కరివేపాకుతో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఉదయాన్నే కొన్ని పచ్చి కరివేపాకు ఆకులను నమిలితే, రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండే పోటు రాకుండా కాపాడే అద్భుత శక్తి కరివేపాకుకు ఉంది.
మనం తినే ఆహారంలోని టాక్కిన్స్ ని శుద్ధి చేసే కాలేయానికి (Liver) కరివేపాకు ఒక టానిక్ లా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి లేదా అధికంగా మందులు వాడే వారికి కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కరివేపాకులోని కెంఫెరోల్, విటమిన్-ఎ, సి లు కాలేయంపై ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి లివర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.
చాలామంది మహిళలు రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడుతుంటారు. అయితే, కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో.. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా దీనికి సాటిలేదు.
Curry leaves | కరివేపాకును వినియోగించే సరైన పద్ధతులు
ప్రతిరోజూ ఉదయం పరగడుపున రెండు లేదా మూడు పచ్చి కరివేపాకు రెబ్బలను బాగా నమిలి తింటే.. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. కరివేపాకును రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి ఆహారంలో భాగంగా తీసుకోవడం, రెండవది నేరుగా జుట్టుకు అప్లై చేయడం.
Curry leaves | కరివేపాకుతో హేయిర్ ఆయిల్…
ఇక జుట్టు సంరక్షణ విషయానికి వస్తే, కరివేపాకుతో తయారుచేసిన హెయిర్ ప్యాక్‌లు అద్భుత ఫలితాలను ఇస్తాయి. కొన్ని కరివేపాకు రెబ్బలను తీసుకుని అందులో… నానబెట్టిన మెంతులు, కొద్దిగా ఉసిరి ముక్కలు కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి, సుమారు అరగంట సేపు ఆరనివ్వాలి. ఆపై కుంకుడుకాయలు లేదా మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గి, మెరుపు వస్తుంది.
అదేవిధంగా, కరివేపాకు నూనె కూడా చాలా ప్రాచుర్యం పొందింది. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను వేడి చేసి అందులో గుప్పెడు కరివేపాకులు వేసి అవి నల్లగా మారే వరకు మరిగించాలి. ఈ నూనెను వడకట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు జుట్టుకు పట్టించి మసాజ్ చేస్తే… జుట్టు మూలాలు దృఢంగా మారి, ఒత్తుగా పెరుగుతాయి.

Curry leaves | అతి సర్వత్ర వర్జయేత్…
అయితే, ఏది చేసినా అది లిమిట్ లోనే చేయాలి. ఏదైనా సరే మితిమీరితే ప్రమాదమే అన్నట్లుగా, కరివేపాకు విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా కరివేపాకు వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొందరికి దీనివల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా పుప్పొడి అలర్జీ ((Pollen Allergy) లేదా కొన్ని రకాల ఆకుల వాసన పడని వారికి కరివేపాకు వాడటం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు రావచ్చు. అందుకే మొదటిసారి వాడేవారు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ఉత్తమం.
ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, కరివేపాకు మొక్కకు పూసే పువ్వులు, పండ్లు. కరివేపాకు ఆకులు మాత్రమే తినదగినవి. దాని పువ్వులు కొన్ని సందర్భాల్లో విషపూరితంగా మారే అవకాశం ఉంటుంది. వాటిని పొరపాటున కూడా ఆహారంగా తీసుకోకూడదు.
అలాగే, ఆస్తమా లేదా శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారు కరివేపాకును అధికంగా వాడకూడదు. ఎందుకంటే ఇందులోని కొన్ని గుణాలు అలర్జీని ప్రేరేపించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించ్చే అవకావం ఉటుంది. జుట్టుకు నూనె వాడేటప్పుడు కూడా రోజూ కాకుండా వారానికి రెండు సార్లు మాత్రమే వాడటం మంచిది.
ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన కరివేపాకును మన నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే ఎన్నో లాభాలు పొందవచ్చు. కేవలం బాహ్య సౌందర్యానికే కాకుండా, లోపలి నుండి ఆరోగ్యాన్ని ఇచ్చే గుణాలు కరివేపాకులో ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా చేసే వ్యాయామంతో పాటు ఇలాంటి సహజమైన చిట్కాలను పాటిస్తే మెరిసే జుట్టుతో పాటు దృఢమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అయితే, ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు కరివేపాకును ఔషధంగా వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
