హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల పెంపు కోసం వారం రోజులుగా సమ్మె చేస్తున్న టాలీవుడ్ కార్మికులు, నిర్మాతలతో జరిగిన కీలక చర్చలు విఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి అన్ని సినిమాల షూటింగ్స్‌ను పూర్తిగా ఆపేస్తామని సినీ కార్మికుల ఫెడరేషన్ ప్రకటించింది.
తెలుగు సినీ కార్మికుల ఫెడరేషన్ 30% వేతనాల పెంపు కోసం డిమాండ్ చేస్తోంది. అయితే నిర్మాతలు పర్సంటేజ్ విధానంలో మాత్రమే వేతనాలను పెంచుతామని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను కార్మికులు తిరస్కరించడంతో చర్చలు విఫలమయ్యాయి.
ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ – “రోజువారీ వేతనాలు అందరికీ సమానంగా పెంచాలి. మేము 13 యూనియన్ల కార్మికులకు పెంపు కోరుతుంటే, నిర్మాతలు 10 యూనియన్లకే పెంపు ఇస్తామంటున్నారు. ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్లకు పెంచలేమనడం అన్యాయం” అని అన్నారు.
ఇప్పటికే వారం రోజులుగా పలు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. చర్చలు విఫలమవడంతో రేపటి నుంచి సమ్మె మరింత ఉధృతం కానుంది. దీనివల్ల చాలా చిత్రాల నిర్మాణం ఆలస్యమై, విడుదల తేదీలు వాయిదా పడే అవకాశం ఉంది.