హైదరాబాద్‌: టాలీవుడ్‌లో గ‌త కొన్ని రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది. వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికుల ఫెడరేషన్ ఆగస్టు 4నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాలు, సీరియళ్లు, వెబ్‌సిరీస్‌ల చిత్రీకరణ పూర్తిగా నిలిచిపోయింది.

నిర్మాతలతో ప‌లుసార్లు చర్చలు జరిగినప్పటికీ ఒప్పందం కుదరలేదు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు పలువురు సినీ ప్రముఖులు కూడా జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది.

అయితే ఎఫ్‌డీసీ చైర్మన్, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుల చొరవతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడంతో పరిష్కారం లభించింది. ప్రభుత్వ జోక్యంతో లేబర్ కమిషన్ నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య చర్చలు ఓ కొలిక్కి వ‌చ్చాయి.

తాజాగా చర్చలు విజయవంతం కావడంతో సమ్మె ముగిసింది. దీంతో రేపటి నుంచి మళ్లీ టాలీవుడ్‌లో షూటింగ్‌లు పునఃప్రారంభం కానున్నాయి

వేతనాలపై కొత్త ఒప్పందం

వేతనాల విషయంలో ఇరు వర్గాల మధ్య 22.5 శాతం పెంపుపై అంగీకారం కుదిరింది. 2 వేల రూపాయల కంటే తక్కువ వేతనం పొందే వారికి మొదటి ఏడాది 12.5 శాతం, రెండవ ఏడాది 2.5 శాతం, మూడవ ఏడాది 5 శాతం పెంపు అమలులోకి రానుంది.

అదేవిధంగా, 2 వేల నుంచి 5 వేల రూపాయల మధ్య వేతనం పొందే వారికి మొదటి ఏడాది 7.5 శాతం, రెండు – మూడో సంవత్సరాల్లో 5 శాతం చొప్పున పెంపు ఇవ్వాలని నిర్ణయించారు.

పెద్ద సినిమాల కోసం ఆదివారాల్లో పనిచేసే కార్మికులకు ఒకటిన్నర రోజుల పేమెంట్ ఇవ్వనున్నారు. ఇక‌ చిన్న సినిమాల విషయంలో మాత్రం రెండో, నాలుగో ఆదివారాల్లో మాత్రమే ఒకటిన్నర కీల్‌షీట్ పేమెంట్ వర్తించనుంది.

ఇక‌ సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో పనిచేయనున్న ఈ కమిటీలో ఇండస్ట్రీ, ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నెలరోజుల్లో మిగతా సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు జరపనుంది.

Leave a Reply