దసరా నవరాత్రులలో చవితి నాడు అమ్మవారిని శ్రీ లలితా త్రిపురసుందరిగా అలంకరిస్తారు. దసరా త్రిపురసుందరి లేదా లలితా త్రిపురసుందరి దశమహావిద్యలలో ఒకరూపము. శ్రీచక్రముపై ఎడమ పాదమును మోపి, చెరకు విల్లు, పుష్ప బాణములు ధరించి బంగారు సింహాసనముపై ఆశీనురాలైవుంటుంది. లలితాత్రిపురసుందరిని ఆరాధించుటవలన ప్రశాంతత, ఆరోగ్యము, జనాధికారత కలుగును.

శ్రీమహావిష్ణువు ఈమెను ఆరాధించి మోహినీ రూపం ధరించాడని పురాణోక్తము. పరమశివుని పర్యంకముపై ఙ్ఞానము, ఆనంద ప్రవాహరూపములో ఆసీనురాలైవుంటుంది. ఙ్ఞానము మరియు ఆనందములతో కూడిన అమృతప్రవాహరూపిణిగా త్రిపురసుందరీదేవిని ఆదిశంకరులు దర్శించారు.
ఉదయించుచున్న సూర్యుని వంటిదై, చతుర్భాహువులు, మూడు నేత్రములు కలదై, పాశము, అంకుశము, బాణములు, ధనుస్సు ధరించినదైయున్న ఆమాతను యోగలు తమ హృదయ కుహరమున ధ్యానింతురు. పృధివీతత్త్వముగల మూలాధారచక్రమును, అగ్నితత్త్వముగల స్వాధిష్టాన చక్రమును, జలతత్త్వముగల మణిపూరచక్రమును, వాయుతత్త్వముగల ఆనాహతచక్రమును, ఆకాశతత్త్వముగల విశుద్ధిచక్రమును, మనస్తత్త్వముగల ఆఙ్ఞాచక్రమును, సుషుమ్నా మార్గమున షట్చక్రభేదనము చేసికొని, సహస్రసార చక్రములో సదాశివునితోగూడి వసించియుంటుంది.
లలితా కవచపారాయణ, లలితా సహస్రనామ పారాయణ అత్యంత ఫలదాయకము. లలితా సహస్రనామములను పరిశీలించినట్లయితే ఒక్క నామము కూడా పునరుక్తి వుండదు. ఎనిమిది వాగ్‌దేవతలైన వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయని, సర్వేశ్వరి, కౌళిని లద్వార రచింపబడినది.
శ్రీలలితా త్రిపురసుందరి స్తోత్రము
శ్రీవిద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం
వాగీశాది సమస్తభూత జననీం మంచే శివాకారకే
కామాక్షీం కరుణా రసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం
కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మవిద్యాం భజే!!
లలితాదేవికి గులాబీరంగు వస్త్రము ధరింపచేసి, నీలంరంగు పువ్వులతో పూజచేసి పాయసం నైవేద్యంగా సమర్పించాలి.
ఈ రోజు శ్రీశైలంలో అమ్మవారు కైలాస వాహనంపై కూష్మాండ రూపంలో దర్శనమిస్తారు.
తేజోమయ రూపంతో ఎనిమిది భూజాలతో కనిపించే రూపం కూష్మాండ. ఈమెను ‘అష్టభుజి’ అనికూడా పిలుస్తారు. కూరగాయలతో చేసిన కదంబం నివేదన చేయాలి. శ్రీసూక్త పారాయణ శ్రేష్టము.
కూష్మాండ శ్లోకము
సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవచ ! దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభదాస్తుమే !!
శుభం భూయాత్
డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము