లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్దవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!
దుర్గానవరాత్రులలో ప్రస్తుత పంచమి మరియు షష్టి తిధులకలయికలో అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అర్చిస్తారు. మహాలక్ష్మి శ్రీమన్నారాయణుని హృదయసుందరి. పార్వతీదేవిని ముగ్గురమ్మల మూలమూర్తిగా కొలుస్తారు. సర్వజగత్తుకు మూలకారణమైనది. సిరిసంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి ప్రతీక. జగత్తు స్థితి కారకుడైన శ్రీమహావిష్ణువునకు తోడుగా మహాలక్ష్మి ఉద్భవించినదని దేవీభాగవతంలో చెప్పబడినది. బృగు మహర్షి కుమార్తెగా జన్మించిన కారణముగా ఈమెన ‘భార్గవి’ అని కూడా పిలుస్తారు. తదనంతర కాలంలో ఈమె దూర్వాసుని శాపం కారణంగా పాలసముద్రమునుండి తిరిగి ఉద్భవించింది. ఈమెను చంద్రసహోదరి అనికూడా వ్వవహరిస్తారు.
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేసురపూజితే
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
ఈ తల్లిని శ్రీసూక్త పారాయణతో, మహాలక్ష్మి సహస్రనామములతో, మహాలక్ష్మాష్ట స్తోత్రముతో స్తుతించాలి. ఈ తల్లికి తొపురంగు చీరను సమర్పించి, కలువపూవులతో, తామరపూవులతో అర్చించాలి. నైవేద్యంగా పూర్ణం బూరెలు సమర్పించాలి.
శ్రీశైలం భ్రమరాంబ ఈరోజు హంసవాహనంపై కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
మహిషాసుర సంహారానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తులతో సృజించిన అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించినందువలన ఈమెను కాత్యాయని అని పిలుస్తారు. ఈమె వాహనం సింహము. కాత్యాయనుడు అనే మునీశ్వరుడు ఆరాధించటం వన ఈమెను కాత్యాయని అని పిలుస్తారు. ఈమెను పసుపు రంగు వస్త్రాలతో అలంకరించిఈ మాతకు బెల్లం అన్నం, ముద్ద పప్పు నైవేద్యంగా సమర్పించాలి.
కాత్యాయని శ్లోకము
చంద్రహాసోజ్జ్ల కరా శార్దూల వరవాహనా ! కాత్యాయనీ శుభం దద్యాద్ధేవి దానవఘాతినీ !!
శుభం భూయాత్!!
డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము