శరన్నవరాత్రి మహోత్సవములలో శుద్ధ చవితినాడు శ్రీ అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవిగా దర్శనమిస్తారు. కత అనే మహర్షికి దేవీ ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుంచి తండ్రి నుంచి భక్తిని అలవరచుకున్న ఆ తపస్వికే,` ‘కాత్యాయనుడనే నామధేయం. ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఇతడు దేవీ భక్తుడు కావడంతో దేవినే పుత్రిక పొందదలచి గొప్ప తపస్సు చేసాడు. దేవి ప్రసన్నురాలైంది. మహర్షికి పుత్రిక గా జన్మించింది. కాత్యాయనుని పుత్రిక కనుక ఆ తల్లి కాత్యాయనీదేవి గా పిలువబడింది. లోకకంటకులైన రాక్షసులను అంతమొందించుటకు ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు కాత్యాయనీ దేవికి తగు శక్తిని ప్రసాదించి లోకకల్యాణం కావించారు. కాత్యాయనీ దేవి భక్తులపాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విథ పురుషార్థాలు సిద్ధిస్తాయి. యోగములు, శోకములు, భయములు నశించి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు భక్తుల ఇంట వర్థిల్లుతాయనడంలో సందేహం లేదు.
కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యధీశ్వరీ!
నన్ద గోపసుతం దేవిపతిం మే కురు తే నమః !!
కాత్యాయనీ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే సాంత్వన భక్తులకు వరంగా చెప్పవచ్చు. ఈ మంత్రాన్ని పూర్తి విశ్వాసంతో భక్తిగా జపించడం వలన
మాంగళ్య దోషాలు తొలగి ఉత్తమ వరునితో కన్యలకి వివాహం కాగలదు.
కొత్తగా వివాహం జరిగిన వారి జీవితంలో సమస్యలు ఎదురైన సందర్భంలో కూడా ఈ కాత్యాయనీ మంత్ర జపం చేయడం వలన భార్యాభర్తలు అన్యోన్య దాంపత్య జీవితాన్ని పొంది, సంతోషంగా జీవించగలరు
ఆ దివ్య మంగళ మంత్రం..
ఓం హ్రీం కాత్యాయన్య స్వాహా , హ్రీం శ్రీం కాత్యాయన్య స్వాహా!
జై కాత్యాయనీ దేవి నమామి.