రోడ్డు ప్రమాదాల నివారించేందుకే.. ‘స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో’..

రోడ్డు ప్రమాదాల నివారించేందుకే.. ‘స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో’..

కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా పోలీసు అధికారి విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు “స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో” పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారులపై పోలీసులు వాహనాలను ఆపి డ్రైవర్లకు విశ్రాంతి కల్పిస్తూ భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సులు తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు.

జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూల్ ఉపవిభాగాల పరిధిలో ఉన్న జాతీయ రహదారుల పై ఈ కార్యక్రమం కొనసాగుతోంది. లారీలు, ప్రయాణికుల బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, సరుకు రవాణా వాహనాలను పోలీసులు ఆపి డ్రైవర్లకు నీటితో ముఖం కడిగించి కొంతసేపు విశ్రాంతి తీసుకునేలా చేసి తరువాత ప్రయాణం కొనసాగించేందుకు పంపిస్తున్నారు. అలసట కారణంగా జరిగే ప్రమాదాలను నివారించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు.

వాహనాలను అతి వేగంతో నడపకూడదని, రాంగ్ రూటులో ప్రయాణించకూడదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని డ్రైవర్లకు పోలీసులు సూచిస్తున్నారు. రోడ్డు భద్రత పై అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పోలీసులు వెల్లడించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ డ్రైవర్లకు జాగ్రత్తలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply