Tirupati | ఫ్లెమింగో ఫెస్టివల్ వచ్చేసింది..

Tirupati | ఫ్లెమింగో ఫెస్టివల్ వచ్చేసింది..
- నేలపట్టు బర్డ్స్ శాంక్చురీలో సందర్శకుల సందడి
Tirupati | నేలపట్టు, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా నేలపట్టు బర్డ్స్ శాంక్చురీలో నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్–2026కు విశేష స్పందన లభిస్తోంది. ఫెస్టివల్‌లో భాగంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, యువతీ–యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పక్షులను ఆసక్తిగా తిలకించారు. బర్డ్స్ శాంక్చురీకి విచ్చేసిన సందర్శకులకు పక్షులను వీక్షించే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది అవగాహన కల్పించారు. పక్షుల సహజ వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెలగాల్సిన విధానాలను వివరించారు.

పక్షులను ప్రత్యక్షంగా వీక్షించిన అనంతరం విద్యార్థులు, సందర్శకులు తమ అనుభూతులను వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రకృతి సౌందర్యం, వలస పక్షుల అందం తమకు మరపురాని అనుభవాన్ని అందించిందని పలువురు తెలిపారు. ఫెస్టివల్‌కు వచ్చిన సందర్శకులకు తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర కనీస సౌకర్యాలను జిల్లా యంత్రాంగం సమకూర్చింది. ఈ ఏర్పాట్లతో సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేశారు.







