(ఆంధ్రప్రభ, తిరుపతి క్రైమ్ )
తిరుపతి నగర సమీపంలోని మంగళం రిక్షా కాలనీలో శనివారం ఒక దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య విభేదాలు ఒక దారుణ హత్య, ఆత్మహత్యకు దారి తీశాయి. స్థానికుల వివరాల మేరకు.. మంగళం తిరుమల నగర్‌లో లోకేశ్వర్, అతని భార్య ఉష ఉంటున్నారు. వీరి మధ్య గత కొన్నేళ్లుగా మనస్పర్ధలు నడుస్తున్నాయి. తన భార్య ఉషపై అనుమానం పెంచుకొని, ఆమెను లోకేశ్వర్ నిరంతరం చిత్రహింసలకు గురిచేసేవాడని స్థానికులు తెలిపారు. దీంతో ఉష తన పుట్టింటికి వెళ్లి, అక్కడి నుంచి ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో ఉష శనివారం ఉదయం విధులకు వెళుతుండగా, మంగళం రిక్షా కాలనీ సమీపంలో లోకేశ్వర్ ఆమెను కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న జిల్లా శాంతిభద్రతల విభాగం అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి, సిబ్బంది నేర స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఉషను హత్య చేసిన అనంతరం, లోకేశ్వర్ తిరుమల నగర్‌లోని తన అద్దె ఇంటికి వెళ్లి, అక్కడ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని లోకేశ్వర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య, ఆత్మహత్యలకు భార్యాభర్తల మధ్య అనుమానాలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
విడాకుల కేసు నేపథ్యం
ఈ దంపతుల మధ్య విడాకుల కేసు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. విడాకుల కేసులో భరణం కట్టాల్సిన పరిస్థితి లోకేశ్వర్‌పై ఉందని, ఇది కూడా హత్యకు ఒక కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. ఉష మృతదేహం వద్ద ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు వర్ణణాతీతం. భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైన ఉష మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారినందరినీ కలిచివేశాయి. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. హత్యకు గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. స్థానికుల నుంచి సమాచారం తీసుకుంటూ, ఈ దంపతుల మధ్య విభేదాలకు గల కారణాలను లోతుగా పరిశీలిస్తున్నారు.