కలకత్తులో తిరుపతి ఎస్పీ బృందం బిజీబిజీ
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం పాతకాలువ రాయల చెరువు గండి పడి, కలత్తు గ్రామంలో నీరు ఉధృతంగా ప్రవేశించిన ఘటన ఈ రోజు ఉదయం సుమారు 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ అనుకోని ఘటనతో గ్రామంలో నీరు మునిగిపోవడంతో జనజీవనం తాత్కాలికంగా అస్తవ్యస్తమైంది. సమాచారం అందిన వెంటనే పుత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రవికుమార్, సీఐలు, ఎస్ఐలు, కేవీబీ పురం, సత్యవేడు, పిచ్చాట్టూరు పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని, గ్రామస్తుల సహాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకొని, పోలీస్ అధికారులు, ఇతర శాఖల సిబ్బందితో కలిసి సహాయక చర్యలను సమన్వయంతో పర్యవేక్షించారు.

సిబ్బందిని అలెర్ట్ చేసిన ఎస్పీ
ఎస్పీ ఎస్పీ సుబ్బరాయుడు పోలీసులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు నీటి మట్టం మార్పులను గమనిస్తూ, అవసరమైతే వెంటనే గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రజల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.

దాదాపు 500 గృహాలు నీటమునిగే పరిస్థితులు ఏర్పడినా, సమయోచిత చర్యలతో ప్రజలను సురక్షితంగా తరలించామన్నారు. పశువుల నష్టం జరిగిన చోట తక్షణ సాయ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ప్రభుత్వం, పోలీస్ శాఖలు ప్రజల భద్రత కోసం పూర్తిస్థాయి సన్నద్ధతతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా కల్పించారు.
పోలీస్ శాఖ ప్రజలకు సూచనలు :

ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలకు పోలీసులు కేలకు సూచనలు చేశారు. ముంపు నీరు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వెళ్లకూడదన్నారు. చెరువులు, వాగులు, వంకల సమీపంలో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వదంతులు, అసత్య సమాచారాన్ని నమ్మకూడదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

