తిరుమల – ఈ నెల 9 నుండి 13వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోన్నారు టీటీడీ అధికారులు. ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఇదివరకే సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తెప్పోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
తెప్పోత్సవాల్లో తొలిరోజున శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడవరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 12న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 13వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల మధ్య తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల కారణంగా 9, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
నేరుగానే స్వామి వారి దర్శనం….
కాగా, నేడు భక్తుల రద్దీ అతిసాధారణం ఉంది.. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండనక్కర్లేదు. క్యూలైన్ల ద్వారా నేరుగా దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
ఇక శుక్రవారం నాడు 52,323 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.