శ్రీ మలయప్ప క‌టాక్షం

శ్రీ మలయప్ప క‌టాక్షం

ఇటు గజరాజుల గమనం
అటు భక్తజనం కీర్తనామృతం
మాఢ వీధుల్లో తిరుమలేశుని వైభవం

( తిరుమల , ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శ‌నివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి (Malayappa Swamy) ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో క‌ల్పవృక్ష వాహనంపై భక్తులకు క‌టాక్షించారు. వాహనం ముందు గజరాజుల గమనం , భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

క‌ల్పవృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి
క్షీర సాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్పవృక్ష‌వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శన‌మిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స‌ర్వ భూపాల వాహనంపై స్వామి అభ‌య‌మిస్తారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల పెద్ద జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల చిన్న జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప‌లువురు బోర్డు స‌భ్యులు, సీవీఎస్వో ముర‌ళికృష్ణ‌ పాల్గొన్నారు.

Leave a Reply