మనవడు దేవాన్ష్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు
అన్న దాన ప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం
భక్తులకు చంద్రబాబు స్వయంగా అల్పహారం వడ్డన
తిరుమల – మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నారా కుటుంబం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సీఎం నారా చంద్రబాబు , భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, అర్ధాంగి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ లు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబానికి వేదాశీర్వచనం అందజేశారు. సీఎం కుటుంబ సభ్యులకు శేష వస్త్రం కప్పి తీర్థప్రసాదాలను టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు, ఈఓ శ్యామలరావు అందజేశారు. యుడుఆలాగే నారా లోకేష్ దంపతులకు శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలను చైర్మన్ అందజేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర కుటుంబ సభ్యులకు మహాద్వారం వద్ద ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు.

భక్తులకు అల్పహారం స్వయంగా వడ్డించిన చంద్రబాబు
దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఇక ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను చంద్రబాబు నాయుడి కుటుంబం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈఓ జె.శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, పలువురు టీటీడీ బోర్డు సభ్యులతో పాటు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.