3 యాక్సిడెంట్స్​..

ఇద్దరు దుర్మరణం.. 21 మందికి దక్కిన ప్రాణాలు  

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​  నెట్​ వర్క్​ ప్రతినిధి)  

వరుస రోడ్డు ప్రమాదాలతో తెలుగు రాష్ట్రాల్లో జనం భయపడుతున్న తరుణంలో.. ఏపీలో గురువారం మూడు ప్రమాదాలు చోటు చేసుకోగా.. ఇద్దరు యువకుకు దుర్మరణం చెందారు. 21 మంది ప్రాణాలతో బయట పడ్డారు.  బాపట్ల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లాలో ఓ ఆటోను కారు ఢీకొనటంతో 16 మంది గాయపడ్డారు. మరో ప్రమాదంలో డ్రైవర్ సమయస్ఫూర్తితో  ఐదుగురికి ప్రాణాపాయం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా క్లాక్ టవర్ జంక్షన్ వద్ద గురువారం  తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్‌ రిజ్వాన్, చింతల నాని సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. సూర్యలంక బీచ్‌ మూసి వేయడంతో అక్కడ నుంచి బైక్‌పై తిరిగి బయలు దేరారు. గుంటూరుకు వస్తుండగా చీరాల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ వెనుక భాగాన్ని వీరు ప్రయాణిస్తున్న బైక్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు ఒక్క సారిగా ఎగిరి కిందపడి అక్కడికక్కడే  ప్రాణాలు కోల్పోయారు.  బాపట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పచ్చిపెంట మండలంలోని రొడ్డు వలస ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం 7:45 గంటల సమయంలో ఒడిశా కు చెందిన ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ఇంజిన్ నుంచి పొగ రావడం గమనించి వెంటనే ఆపి అందరినీ సురక్షితంగా దింపాడు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలో బయటపడ్డారు.నెల్లూరు జిల్లా పరిధిలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని మొచర్ల నేషనల్ హైవే వద్ద పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన ఆటోను వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టంతో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. ఘటన సమయంలో ఆటోలో 13 మంది ప్రయాణికులు, కార్‌లో ముగ్గురు ఉన్నారు. గాయపడ్డ వారిని కావలి, ఉలవపాడు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. క్షతగాత్రులను కరేడు పంచాయతీ పరిధిలోని అలగైపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply