నెల్లూరు, ప్రతినిధి (ఆంధ్రప్రభ) : మొంథా తుఫాన్ నేపధ్యంలో భారీ వర్షాల కారణంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని రామకోటయ్యనగర్‌లో హోటల్‌పై పట్ట కప్పేందుకు పైకి ఎక్కిన బి. రామమోహన్ అనే వ్యక్తి 11 కేవి విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ముత్తుకూరు మండలంలో షేక్. మస్తాన్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతి చెందాడు.
అలాగే అదే నియోజకవర్గ పరిధిలోని మనుబోలు మండలం పొట్టేళ్ల వాగులో దిగిన ఓ వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందడం జరిగింది. మంగళవారం ఉదయం నుంచే మొంథా తుఫాన్ తన తీవ్ర ప్రభావాన్ని నెల్లూరు జిల్లాపై చూపుతోంది. తీర ప్రాంతంలో రాకాసి అలలతో సముద్రం గర్జిస్తోంది. జిల్లా అంతటా భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతూ పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి.
పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ వర్షం కారణంగా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సమీపంలోని సురక్షిత, పునరావాస శిబిరాలకు అధికారులు తరలిస్తున్నారు. నెల్లూరు నగరంలో జన జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. జిల్లాలో భారీ వర్షానికి తోడు ఈదురుగాలుల కారణంగా భారీ వృక్షాలు, విద్యుత్ స్థంభాలు నేలకొరుగుతున్నాయి.
కొన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం నిలిచిపోవడంతో అంధకారంలో ఆయా గ్రామాలు మగ్గుతున్నాయి. జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్ ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు జారీ చేస్తున్నారు. తుఫాన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని విధాల సహకరించాలని ఆయన సూచించారు. అదేవిధంగా పునరావాస శిబిరాల్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి కావలసిన అన్నీ అందించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్‌తో పాటు ఆయన తిక్కన ప్రాంగణంలో ఉంటూ సూచనలు జారీ చేయడం జరుగుతోంది. మరోవైపు పునరావాస కేంద్రాలను స్వయంగా సందర్శించిన కలెక్టర్ నేరుగా తుఫాన్ బాధితులతో, పిల్లలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి పోలీసులకు పలు సూచనలు చేశారు. సురక్షిత కేంద్రాలను సందర్శించిన ఆమె మహిళలతో స్వయంగా మాట్లాడి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా.. లేదా అన్న విషయం ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారులపై ఒక్కరోజు పాటు భారీ వాహనాలు రాకపోకలపై నిషేదం విధిస్తున్నామని, తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత నిబంధనలు తొలగిస్తామని చెప్పారు. అదేవిధంగా తిరుపతి పర్యటన తర్వాత నెల్లూరు జిల్లాకు వచ్చిన ఏపీఎస్‌పీడీసీఎల్ చీఫ్ ఎండీ ఎల్. శివశంకర్ అధికారులతో సమీక్షించి విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.
వాగులు, వంకలు పరవళ్లు… రాకపోకలకు అంతరాయం
జిల్లాలోని ప్రధాన జలాశయం అయిన సోమశిల పూర్తిగా నిండిపోవడంతో పైతట్టు ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు అధికారులు దిగువకు వదిలి వేస్తున్నారు. దీంతో పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ సంగం, పెన్నా బ్యారేజీలను దాటి సముద్రం వైపు పరుగులు తీస్తోంది. పెన్నానది పరివాహక ప్రాంతాలను అప్రమత్తంగా చేసిన అధికార యంత్రాంగం అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తోంది. మరోవైపు జిల్లాలోని అన్ని వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
కందుకూరు డివిజన్‌లోని గుడ్లూరు పెద్ద చెరువు వరవ ఉదృతంగా ప్రవహించడంతో గుడ్లూరు, నరసాపురం మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. అదేవిధంగా కావలి-కందుకూరు ప్రధాన రహదారిలో గుడ్లూరు, పోట్లూరు మధ్య రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నెల్లూరు శివార్లలోని బుజబుజ నెల్లూరు ప్రాంతంలో జాతీయ రహదారిపై రెండు అడుగుల మేర వర్షపునీరు ప్రవహిస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది.
శివారు కాలనీల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో డ్రైనేజీ కాలువలు పొంగి వీధులు వరద నీటితో నిండి జన జీవనం స్థంభించిపోయింది. వింజమూరు మండలం కాటేపల్లి వాగు ఉదృత ప్రవాహంతో చాకలకొండ, పామూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపురం మండలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పిన్నేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఏఎస్‌పేట మండలంలో తెల్లపాడు వాగు, నక్కల వాగు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో ఆత్మకూరు-ఏఎస్‌పేట, ఏఎస్‌పేట-హసనాపురం ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది.
మనుబోలు మండలంలో పొట్టేళ్ల వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు వాగుల వద్దకు చేరుకుని రాకపోకలు నిషేదం విధిస్తూ రహదారులపై ముళ్ల కంపలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లాలోని దాదాపు అన్ని చెరువులు వర్షపు నీటితో నిండి గండ్లు పడే ప్రమాదంలో ఉన్నాయి. జిల్లా కలెక్టర్ సూచనలతో నీటి పారుదల శాఖ అధికారులు చెరువుల వద్ద పర్యటిస్తూ గండ్లు పడకుండా జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు. అన్నిచోట్ల అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులు తమ సహాయ సహకారాలను అందజేస్తున్నారు.



