విషం తాగిన ఆస్పత్రి పాలైన వ్యక్తి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: గజేంద్రతో పాటు ఇద్దరు టీవీ రిపోర్టర్లు ఒత్తిడి చేసి బెదిరించడంతో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నాశం పల్లి గ్రామానికి చెందిన నర్సింహులు విషం తాగిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. గ్రామానికి నర్సింహులు అనే వ్యక్తి గజేంద్ర వద్ద దఫాదఫాలుగా మొత్తం రూ.1,75,000/- అప్పు తీసుకుని వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. అప్పు మొత్తం పూర్తిగా చెల్లించలేదన్న కారణంతో 15వ తేదీ రాత్రి 9 గంటలకు గజేంద్ర, నరసింహుల ఇంటి వద్ద ఉన్న రెండు ఆవులు, ఒక దూడను బలవంతంగా తీసుకెళ్లి తన ఇంట్లో కట్టి పెట్టాడు. దీనిపై ఫిర్యాదు చేసిన నరసింహులకు పోలీసులు వెంటనే స్పందించి ఆవులను తిరిగి ఇచ్చిపుచ్చారు.
తదుపరి రోజు గజేంద్ర పెద్దమనుషులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు విచ్చేసి, రెండు నెలల్లో అప్పు మొత్తం చెల్లించాలనే అంగీకారంతో వెళ్లిపోయాడు. అయితే అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు గజేంద్రతో పాటు TV-9 రిపోర్టర్ చిన్ని, సుమన్ TV రిపోర్టర్ మునస్వామి నరసింహులను పిలిపించి వెంటనే డబ్బులు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి, బెదిరింపులకు దిగినట్లు విచారణలో బయటపడింది. ఈ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన నరసింహులు సుమారు 2.30 గంటల సమయంలో ఇంటికి వెళ్లి ముందుగా తెచ్చి పెట్టుకున్న విషాన్ని తాగాడు. కడుపులో మండడంతో భార్యకు విషయం చెప్పడంతో, ఆమె అప్రమత్తమై పొరుగు వారి సహాయంతో చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో విచారణ చేసిన పోలీసులకు, గజేంద్రతో పాటు టీవీ రిపోర్టర్లు చేసిన బెదిరింపుల వల్లే విషం తాగినట్లు నరసింహులు స్పష్టంగా వెల్లడించాడు. విషయం పై ఉన్నతాధికారులకు సమాచారం పంపించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జి.డి. నెల్లూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాసంతి తెలిపారు.

