పంచాయితీ ఎన్నికల్లో బెదిరింపులా..!

- బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే జైలు పాలా..?
- పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారా..?
- మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి ఆరోపణలు
ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి : పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తుందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలు పెరిగిపోయాయని, అరాచకమే రాజ్యమేలుతోందని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారని గ్రహించిన అధికార పార్టీ, బీఆర్ఎస్ అభ్యర్థులను భయపెట్టి జైలు పంపిస్తామని, కోర్టుల చుట్టూ తిప్పేస్తామని బెదిరిస్తోందని అన్నారు.
బాహుపేట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కవిడే మహేందర్‌పై గత వారం రోజులుగా పార్టీ మారమని ఒత్తిడి తెస్తున్నారని, ఆయన వెనక ఇద్దరు పోలీసులను పెట్టి భయపెడుతున్నారని తెలిపారు. సర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి చొరబడి మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలను కూడా ఆగ్రహంగా ప్రస్తావించారు.
అధికార పార్టీ సూచనలు మేరకు పోలీసులు వ్యవహరించుతుంటే, ఎన్నికల సంఘం వద్ద అధికారికంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు, పోలీసులు కలిసి అభ్యర్థులను వేధిస్తున్నారని, వారందరిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అహంకారంతో పాలన సాగిస్తోందని, ఏ తప్పు జరిగినా కలెక్టర్‌తో పాటు కాంగ్రెస్‌దే బాధ్యత అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ బలం రెట్టింపు స్థాయిలో పెరిగిందని, ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు దిగుతుందని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఊరురా గులాబీ జెండా ఎగరేయాలని, ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు.
