ఆ రెండింటికి ఓటు అడిగే హక్కు లేదు
కరీంనగర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీదే విజయమని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు (N. Ramachandra Rao) అన్నారు. ఈ రోజు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం మొదలైందన్నారు. జడ్పీటీసీ (ZPTC) అభ్యర్థులను డిక్లేర్ చేస్తామని, ఏకగ్రీవంగా ఉన్న చోట బీఫాం లు ఇస్తామన్నారు. వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, అత్యధిక స్థానాలను సాధిస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని, పార్టీని వీడేటప్పుడు రాజీనామా చేయాలన్నదే తమ అభిమతమన్నారు. ఎవరైనా గెలిచిన పార్టీ నుండి ఇతర పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు రాజీనామా చేసి వెళ్లాలని సూచించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓట్లు అడిగే అర్హత లేదు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress, BRS) లకు ఓట్లు అడిగే అర్హత లేదని రామచందర్ రావు అన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని, కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాలను దెబ్బతీశారని ఆరోపించారు. నాడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారన్నారు. పంచాయతీలకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని దుస్థితి తెచ్చారని చెప్పారు. కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసింది. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే కాంగ్రెస్ పార్టీ మోసాలు చేస్తోందని అన్నారు. ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు.

గ్రామాలు బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలి..
బీజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకొస్తామని రామచందర్ రావు అన్నారు. గ్రామాలు బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. 42 శాతం రిజర్వేషన్ల సవరణ అప్పుడే చేస్తే ఈ సమస్య వచ్చేది కారని అన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కు కట్టుబడి ఉందన్నారు. దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అనేక సామాజిక సమస్యలుంటాయని చెప్పారు. రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అని చెప్పారు.
మేడిగడ్డను రిపేర్ చేయాలి..
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి పాల్పడిందని, ఈ ప్రాజెక్టు పై విచారణ చేయాలని రామచందర్ అన్నారు. కానీ మేడిగడ్డ, సుందిళ్లకే పరిమితం చేయడం సరికాదన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ప్రకారం వాటిని రిపేర్ చేయాలన్నారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేస్తూనే మేడిగడ్డ మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా పునరుద్ధరించాలన్నారు.