ఆ నలుగురు దొరికినట్టే…

ఆ నలుగురు దొరికినట్టే…
- గంజాయి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
- రూ.37 వేల 500ల విలువగల గంజాయి స్వాధీనం
కేతే పల్లి, ఆంధ్ర ప్రభ : గంజాయి కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు 37,500 రూపాయల విలువగల 1.5 కేజీల గంజాయిని, మూడు సెల్ ఫోన్లు, రెండు పల్సర్ మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డిఎస్పి కే శివరామిరెడ్డి(DSP K Shivarami Reddy) తెలిపారు.
ఈ రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఆయన వెల్లడించారు. గంజాయి, మాదకద్రవ్యాల(Marijuana, Narcotics) నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం విస్తృత తనిఖీలో భాగంగా ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం రాగా కేతేపల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి ఇప్పలగూడెం (Ippalagudem) గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మూడు మోటార్ సైకిల్ పై ఏడుగురు వ్యక్తులు గుడివాడ గ్రామం నుండి కేతేపల్లి వైపు వస్తుండగా పోలీసులను చూసి ఒక మోటార్ సైకిల్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోగా మిగతా వారిని మోటారు సైకిళ్ళతో కలిపి పట్టుబడి చేసి విచారించినట్లు చెప్పారు.
శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన సోము సాయి తేజ(Somu Sai Teja) (ఏ 1) హైదరాబాదులో పనిచేస్తున్న సమయంలో గంజాయి తాగడం అలవాటయింది. అక్కడ పని చేస్తున్న సమయంలో వచ్చిన డబ్బులు అతని జల్సాలకు సరిపోకపోవడంతో ఎలాగైనా డబ్బులు సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశా రాష్ట్రంలో గంజాయి తక్కువ ధరకు దొరుకుతుందని తెలుసుకొని తన గ్రామస్తుడు, స్నేహితుడైన గంజాయి తాగడం అలవాటున్న ఐలపాక ప్రభు(Ailapaka Prabhu) (ఏ 2) కు గంజాయి వ్యాపారం గురించి తెలిపి ఇద్దరు కలిసి గతంలో ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో గల ఒరిస్సా రాష్ట్రంలోని కోరమనూరులో పరదాల్ (ఏ 7) వద్ద గంజాయి కొనుగోలు చేసి అట్టి గంజాయి వారు తాగడంతో పాటు అవసరం ఉన్నవారికి అమ్మి వ్యాపారం చేయగా మంచి లాభాలు వచ్చాయి.
ఇలా గంజాయి అమ్మే క్రమంలో వారిద్దరికీ సూర్యాపేట జిల్లా(Suryapet district) జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పగిడిమర్రి మహేష్, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండ పాలెం గ్రామానికి చెందిన వంగూరి ప్రేమ్ కుమార్, నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన నారగోని వేణు, కేతేపల్లి మండలం కాసనకోడు గ్రామానికి చెందిన శ్రీపతి ఉదయ్ తో పాటు మైనర్ బాలుడు పరిచయమయ్యారు.
ఆ తరువాత సోము సాయి తేజ గంజాయి వ్యాపారం, అందులో వచ్చే లాభాల గురించి వారికి చెప్పి గంజాయి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దామని అనుకొని అందరూ కలిసి డబ్బులు వేసుకొని సోము సాయి తేజ, ఐలపాక ప్రభులకు ఇవ్వగా వారు ఇరువురు కలిసి పది రోజుల క్రితం పల్సర్ బైక్ టి జి 05 డి 3041 మీద ఆంధ్ర ఒడిస్సా బార్డర్ లోని కోరమనూరు వెళ్లి అక్కడ కేజీ రూ.3 వేల చొప్పున 2.5 కేజీల గంజాయి(2.5 kg of ganja at Rs. 3 thousand per kg) కొనుగోలు చేసి దానిని వంగమర్తి గ్రామం తీసుకొచ్చి సాయి తేజ ఇంట్లో దాచి పెట్టారు.
అందరూ కలిసి అట్టి గంజాయిని తాగగా మిగిలిన గంజాయిని ఈ నెల 10న సాయి తేజ ఇంటికి అందరూ వెళ్లి మిగిలిన గంజాయిని సమానంగా పంచుకోగా తలా 300 గ్రాముల గంజాయి రాగా అందరూ వారి వాటాకి వచ్చిన గంజాయిని నల్లని కవర్లలో నింపుకొని మూడు బైకుల మీద ఏడుగురు నిందితులు వంగమర్తి నుండి సూర్యాపేటకు వెళ్ళుటకు గుడివాడ మీదుగా వస్తున్నారు.
ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం రాగా కేతేపల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి ఇప్పలగూడెం గ్రామ శివారుకు వెళ్లి నలుగురు నిందితులను ఒక బాలుడిని అదుపులోకి తీసుకోగా పోలీసులను చూసి మరో ఇద్దరు నారగోని వేణు, శ్రీపతి ఉదయ్(Naragoni Venu, Sripathi Uday) వారి వాటాకు వచ్చిన గంజాయి కవర్లతో వారు వచ్చిన బైక్ మీదనే పారిపోయారు. పట్టుబడి చేసిన నలుగురు నిందితులు, ఒక బాలుడు వద్ద నుండి 1.5 కేజీల గంజాయి, రెండు పల్సర్ బైక్ లు, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంజాయి నిందితులను పట్టుబడి చేసిన కేతేపల్లి ఎస్సై సతీష్, శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
