- వైసీపీ మండల అధ్యక్షుడు కొండలు
ఆంధ్రప్రభ, శావల్యాపురం (గుంటూరు జిల్లా) : వైసీపీ సానుభూతిపరులు అనే వంక చూపి రాజకీయ కక్షతో తెలుగుదేశం పార్టీ నాయకులు పేదవాళ్ల పెన్షన్లు నిలిపివేసి కడుపు కొట్టడం దుర్మార్గ చర్య అని వైసీపీ శావల్యపురం మండల పార్టీ అధ్యక్షుడు బోడేపూడి కొండలు మండిపడ్డారు.
మండలంలోని వయ్యకల్లు గ్రామానికి చెందిన కొర్రపాటి లక్ష్మీనారాయణ, ఎస్సీ కాలనీ చెందిన దారా వీరాస్వామి, దారా నాగరాజు, దారా మోషే, దారా ఎలియా ల పింఛన్లకు ఒక నెలలో మూడు సార్లు నోటీసులు అందజేయడంతో మండల పరిషత్ కార్యాలయం వద్ద కన్వీనర్ కొండలు, స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పెన్షన్ నోటీసులు అందుకున్న బాధితులు మాట్లాడుతూ.. వయ్యకల్లు గ్రామంలో పుట్టి పెరిగి గ్రామంలోనే నివాసం ఉంటూ మా పూర్వీకుల వారసత్వంగా వస్తున్న చెప్పులు కుట్టడం మా వృత్తని అందుకు ప్రభుత్వం చర్మకారుల పెన్షన్ కూడా అందిస్తోందని పేర్కొన్నారు.
మా గ్రామంలో రాజకీయ కక్షలు ఎక్కువగా ఉన్నాయని, కేవలం ఎస్సీ కులానికి చెందినవారమనే నెపంతో రాజకీయ కక్షగట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మేము ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తోనే బతకాలని మాకు ఎటువంటి భూములు లేవని, వ్యవసాయ కూలీ పనులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయని, మాకు జీవనాధారం ప్రభుత్వం ఇచ్చే పింఛనేనని ఇప్పుడు ఆ పెన్షన్లు ఆపితే మా కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో చర్మకారుల పెన్షన్లు 30 పైగా ఉన్నా కేవలం మా పైనే రాజకీయ కక్ష్యగట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి, అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రంతోపాటు చర్మకారుల పత్రాలను కూడా అందజేశారు. వారితోపాటు ఆళ్ల రామ్మోహన్ రావు, ముండ్రు రాముడు, కొర్రపాటి రామాంజనేయులు, కొర్రపాటి రామాంజి, కావూరి వీరేంద్ర తదితరులు ఉన్నారు.