ఇదే వినూత్న విష వలయం…
తెలంగాణ నెట్ వర్క్ కో-ఆర్డినేటర్ : పాము తన పిల్లలను పుట్టిన వెంటనే ఆకలికి ఆగలేక తినేస్తుంది… పులి కూడా అంతే! అయితే వాటికి ఆలోచన శక్తి లేదు.. అందుకే ఒకటి విషం చిమ్ముతుంది.. మరొకటి క్రూరంగా ప్రవర్తిస్తుంది. ఆలోచనశక్తి కలిగిన మానవుడు కూడా మృగానిగా మారుతున్నాడు.
ఏదీ మంచి, ఏదీ చెడ్డో తెలిసిన మానవుడి మానవత్వం ఏమవుతుందన్న ఆందోళన ప్రజల్లో ఉంది. సమాజాన్ని పీడిస్తున్న విషపు సంస్కృతిని ఆగేదెన్నడో అని ప్రతి ఒక్కరీ ప్రశ్న. ఇటీవల కుటుంబ కలహాలు కారణంగా భార్య పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకోవడం, అలాగే పిల్లలను చంపి తల్లులు ఆత్మహత్య చేసుకోవడం పరిపాటి అయిపోయింది!
ఈ ఏడాది ఇలాంటి సంఘటనలు చూసి ప్రతి ఒక్కరూ తల్లడిల్లీపోతున్నారు….
వికారాబాద్‌లో విషాదకర ఘటన…
తాజాగా ఈరోజు వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో అనుమానం, కుటుంబ కలహాల నేపథ్యం ఓ వ్యక్తి భార్య, కూతురు, వదినను దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కుమార్తెకు తృటిలో ప్రాణాపయం తప్పింది.
వేపూరి యాదయ్య (38) తాను బలవన్మరణానికి పాల్పడుతూ అంతకుముందు తన భార్య వేపూరి అలివేలు (32), వదిన హనుమమ్మ (40), చిన్న కూతురు శ్రావణి (10) ప్రాణాలను తీశాడు. పెద్ద కూతురు అపర్ణ (13) మాత్రం ప్రాణాపయం నుంచి బయటపడింది. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.

అభద్రత, ఆర్థిక సమస్యలు, అనుమానం…
ఆవేశంలో ఉన్న వాడికి విచక్షణం ఉండదు. అందుకే ఆ ఆవేశంలోనే ఎందరో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒక క్షణం ఆవేశం తగ్గించుకుంటే ఇలాంటి అఘాయిత్యాలు ఉండవు అనడంలో సందేహం లేదు.
అభద్రత.. ఆర్థిక సమస్య… అనుమానం.. ఆవేశంతో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరికొందురు ఒకింత ముందడుగ వేసి పిల్లలను, భార్యను చంపి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు వీధిన పడిపోతారన్న అభద్రతతోనే పిల్లలను, భార్యను హతం చేసి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మరికొందరు తాను బతకకపోతే కుటుంబంలో ఎవరూ బతకకూడాన్న ఆలోచన కూడా ఇలాంటి దుర్ఘటనలకు కారణమవుతున్నాయి.
సోషల్ మీడియా ప్రభావం…
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ద్వారా వస్తున్న కథనాలతో కుటుంబ సభ్యులపైనే నమ్మకాలు పోతున్నాయి. ఏ చిన్న అనుమానం వచ్చినా… అది పెనుభూతంగా మారిపోతుంది. ప్రధానంగా వివాహేతర సంబంధాల వల్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కొత్త ప్రాంతాలకు వచ్చికాపురం పెట్టిన వారికి కొత్త పరిచయాలు పెరగడంతో కొన్ని పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారితీస్తుంది.
అనుమానాలు వచ్చినప్పుడు కొందరు నిర్ధారించుకుంటున్నారు. కానీ వాటిని చర్చించి పరిష్కరించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు వేదికలు కరువయ్యాయి. ఒక్కప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏ సమస్య వచ్చినా, ఏ అనుమానం వచ్చినా పెద్దలు చర్చించి తప్పు చేసిన వాడిని మందలించేవారు.
ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అనుమానాలు పరిష్కరించుకునే వేదికలు కరువయ్యాయి. ఆర్థిక సమస్యలు కూడా ఆత్మహత్యలకు ఒక కారణమవుతుంది. ఆర్థిక సమస్యలు.. ఉపాధి అవకాశాలు కోసం తెలియని ప్రాంతాలు కుటుంబాలతో సహ వెళ్లిపోతున్నారు. చాలీచాలనీ జీతాలు… అప్పులు ఇచ్చే వారు లేకపోవడం.. ఒకవేళ అప్పు చేసి తీర్చలేక వేధింపులకు గురికావడంతో ఎందరో కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
పాపం పసివాళ్లు..
ఇలాంటి అఘాయిత్యాలతో ప్రాణాలతో బయటపడిన పసి పిల్లల బతుకులు చిద్రంగా మారుతున్నాయి. అభంశుభం తెలియని పసిపిల్లలు ప్రాణాలతో బయటపడి జీవితాంతం తల్లిదండ్రులు చేసిన పాపానికి కుమిలికుమిలి ఏడుస్తూ.. నిత్యం చస్తూ బతుకుతుంటారు! ఈ స్థితికి తీసుకువచ్చిన దేవుడిని, వాళ్ల కన్న తల్లిదండ్రులను శాపనార్థాలు పెడుతూ తమ జీవనాన్ని సాగిస్తుంటారు. ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చిన తల్లిదండ్రులు సమాజంలో చెడ్డవారిగానే మిగిలిపోతారు.
ఇలాంటి అఘాయిత్యాలను అడ్డుకోవాలంటే కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా ప్రజాచైతన్యం తీసుకు రావాలి. తరచూ ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలోనూ ప్రజావేదికల ద్వారా ప్రజలను చైతన్యపరచాలి. కౌన్సెలింగ్ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య కూడా పెంచుకోవాలి. ప్రతి ప్రాంతంలోనూ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తరచూ వివాదాలు పడుతున్న భార్యాభర్తలను ఇరుగుపొరుగు వాళ్లు గుర్తించి కౌన్సెలింగ్ కేంద్రాల దృష్టికి తీసుకెళితే వారి సమస్యలు పరిష్కరించగలిగితే ఇలాంటి అఘాయిత్యాలు నివారణ అవుతాయని చెప్పొచ్చు.

