ఈ డైరెక్ట‌ర్ బ్రేకుల్లేని బుల్డోజ‌ర్ !!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు దర్శకులు తమ మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో సుజీత్ పేరు ఎప్పుడూ ముందుంటుంది. సుజీత్ దర్శకత్వ శైలి తరచుగా స్టైలిష్, విజువల్‌గా ఆకర్షణీయంగా ఉంటుందని, హాలీవుడ్ స్థాయి యాక్షన్ ప్రదర్శనలో ఆయన ప్రత్యేకత కనిపిస్తుందని విమర్శకులు, ప్రేక్షకులు చెప్పుకుంటారు. ముఖ్యంగా యూత్ లో సుజిత్ కు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

2014లో రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూట్ చేసిన సుజీత్, ఆ సక్సెస్ తర్వాత వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. రెండో సినిమాతోనే ప్రభాస్‌ కు యాక్షన్ చెప్పి.. ప్రేక్షకులతో సాహో అనిపించిన భారీ పాన్-ఇండియా మూవీ సాహో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు సుజిత్. సాంకేతికంగా అద్భుతంగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సాధించింది. స్క్రీన్‌ప్లే విషయంలో విమర్శలు ఎదురైనా, సుజీత్‌కి ఈ సినిమా పాన్-ఇండియా డైరెక్టర్ ఇమేజ్ ని తీసుకు వచ్చింది.

ఇక మూడో సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పని చేసే అవకాశం రావడం సుజిత్ కెరీర్‌లో మరో మైలురాయి. ప్రస్తుతం They Call Him OG అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాను తెర‌కెక్కిస్తున్న‌ సుజీత్.., ఈ ప్రాజెక్ట్ తో పరిశ్రమ మొత్తం మళ్ళీ తనపై దృష్టి పెట్టేలా చేశాడు. అయితే, ఈ సినిమా పూర్తవ్వ‌కముందే మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టి, బ్రేకుల్లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్నాడు.

ఓజీ తరువాత సుజీత్, న్యాచురల్ స్టార్ నానితో ఓ సినిమాకు సిద్ధమవుతున్నారు. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అవ్వ‌గా, ప్రీ-ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా జ‌రుగుతున్నాయి. కాగా, ప్ర‌స్తుతం ఓజీ సినిమాతో బిజీగా ఉన్న సుజీత్.. ఆ సినిమా రిలీజ్ త‌రువాత యూర‌ప్ వెల్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేయడంతో పాటు, లొకేషన్ల కోసం సుజిత్ తన బృందంతో కలిసి యూరప్ వెళ్లనున్నట్లు సమాచారం.

ఒకవైపు నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నాని, మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. తన సొంత బ్యానర్ ‘వాల్ పోస్టర్ సినిమాస్’ ద్వారా యంగ్ టాలెంట్‌కి అవకాశాలు కల్పిస్తూ, విభిన్నమైన కథలకు ప్రోత్సాహం ఇస్తున్నారు.

ప్రస్తుతం ఆయన, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన రా స్టేట్‌మెంట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని రేపి, అంచనాలను మరింత పెంచింది. 2025 మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా షూటింగ్‌తో నాని ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే, నాని–సుజీత్ కాంబినేషన్‌లో ఒక కొత్త సినిమా ఇప్పటికే అధికారికంగా ప్రకటించ‌గా.. ఓజీ షూటింగ్ ఆలస్యం కాకుండా పూర్తయి ఉండుంటే, ఈ కాంబినేషన్ చిత్రం ఇప్పటికి సెట్స్‌పై ఉండేదన్నది ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఓజీ ఈ నెలలో విడుదలకు సిద్ధమవ్వ‌గా.., ఆ తర్వాత సుజీత్ తన పూర్తి దృష్టిని నాని సినిమాపైనే పెట్ట‌నున్నట్టు సమాచారం.

దీంతో నాని-సుజీత్ కాంబినేషన్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఒక వైపు వరుస విజయాలతో నాని కెరీర్ పీక్‌లో దూసుకుపోతుంటే, మరోవైపు సుజీత్ తన హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసే ప్రాజెక్ట్ పై ప్రేక్షకులు, అభిమానుల ఆశలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.

Leave a Reply