ఎక్కడెక్కడంటే….

జీవితంలోనైనా, ప్రయాణాల్లోనైనా మలుపులు సహజం…కానీ అవి ప్రమాదకరంగా పరిణమించినప్పుడే వాటి పట్ల భయమేర్పడుతుంది…. ఓవర్ టేక్ ల వల్లనైతేనేమి, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనైతేనేమి ఇటీవల చోటు చేసుకుంటున్న యాక్సిడెంట్లపై అనేక కోణాల్లో అంతులేని ఆలోచనలు…ఊహకందని భయాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే అలాంటి ప్రమాదాలు ఇంకెక్కడెక్కడ జరిగే ఆస్కారముంది? ఆ రూట్లలో మనము, మనవాళ్ళు వెళ్ళే అవసరముందా? ప్రమాదాల బారిన పడే ఆస్కారముందా అని ఎవరికి వారు ఆలోచనలో పడుతున్నారు.

ప్రస్తుతం ఎన్నో చోట్ల రోడ్డు మార్గాలు మూల మలుపులతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కాస్త దూరమైనా సరే ముందస్తుగా సర్వేలు చేసి, ఆలస్యమైన సేఫ్ రూట్ ను ప్లాన్ చేయడం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, అరిగి పోయిన రోడ్ల మీద భారీ వాహనాలు పరిమితికి మించిన లోడ్ తో సంచరించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్లు బాగుంటే ప్రయాణం సజావుగా సాగుతుంది.

అవసరమైన చోట డివైడర్లు నిర్మించడం, డేంజర్ జోన్ల వద్ద ప్రమాదకర హెచ్చరికలు తప్పనిసరిగా ఏర్పాటు చేయడం అత్యంత ఆవశ్యం. రాత్రి సమయంలో రోడ్డు ప్రమాద నివారణకు మలుపుల వద్ద తప్పనిసరిగా రేడియం సిక్కర్లు తగిలించాలి.

ప్రమాదకర మలుపులు చాలానే ఉన్నాయ్…అందులో కొన్ని… హైదరాబాద్ నుండి వరంగల్ హైవేపై వెళ్లే మార్గంలో నారపల్లి వద్ద మూల మలుపు. జగిత్యాల పట్టణంలోని రహ్మత్ పురాలో దగ్గులమ్మ గుడికి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఏర్పడిన ప్రమాదకరమైన గుంత. హైదరాబాద్‌ – బీజాపూర్‌ జాతీయ రహదారి-163. ముఖ్యంగా మొయినాబాద్‌, చేవెళ్ల మండలాల్లోని అజీజ్‌ నగర్‌, చిన్న షాపూర్‌, కనక మామిడి, ముడిమ్యాల్‌, మీర్జాగూడ వంటి ప్రాంతాల్లోని మలుపులు మృత్యు కేంద్రాలుగా మారాయి. ఈ మలుపుల కారణంగానే వారానికి సగటున 3 నుంచి 5 ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికులు నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండల మధ్య నుంచి తాండూరు వెళ్లే మార్గంలో పై నుంచి కిందకు వెల్లే క్రమంలో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందే. ఇలాంటివి రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్నాయని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు, తక్షణమే తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ప్రజలు.

Leave a Reply