ఉత్సవాల్లో ఆనందవాతావరణం నెలకొనాలి..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : శరవన్నరాత్రోత్సవాల్లో ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ ఉత్సవాల్లో ఆనంద వాతావరణం నెలకొనేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని విజయవాడ ఎంపీ శివనాథ్ కోరారు. విజయవాడ న‌గ‌రంలో జరుగుతున్న దసరా ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మోడ్రన్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. భద్రతా చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఎస్పీ ఆనందరెడ్డి, ఏసీపీ పావని తదితర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ భద్రతా వ్యవస్థపై సమగ్రంగా ఆరా తీశారు. సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా జరిగే పర్యవేక్షణపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రతి వేదిక వద్ద (రియల్ టైమ్) మానిటరింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

భద్రతా చర్యలపై ఎంపీ సూచనలు..

ఉత్సవాల్లో పాల్గొనే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులకు ఎంపీ సూచించారు. ప్రతి వేదిక వద్ద భద్రతా సిబ్బంది తగిన సంఖ్యలో ఉండాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. అత్యవసర వైద్య సౌకర్యాలు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆయన తెలిపారు.

సమన్వయంతో విజయవంతం చేయాలి..

దసరా ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, సురక్ష కమిటీ కన్వీనర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయడానికి సూచనలు చేశారు. మొత్తం మీద దసరా ఉత్సవాల విజయవంతం కోసం భద్రత, ట్రాఫిక్, అత్యవసర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ శివనాథ్ చేసిన సూచనలు ఈ సమీక్షలో ప్రధానాంశాలుగా నిలిచాయి.

Leave a Reply