ప్రజా సేవలో.. పోలీస్
( ఆంధ్రప్రభ విజయవాడ) : మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ, ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్నారు పోలీసులు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి అప్రమత్తంగా ఉండేందుకు అన్నీ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు స్వీయ పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తును ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం అన్నీ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. మొంథా తుపాను మొదలైనప్పటి నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ కొండ చరియలు విరిగిపడేందుకు అవకాశమున్న కొండ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు నచ్చజెప్పి అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
తీవ్రమైన గాలులకు పడిపోయే అవకాశం ఉన్న హోర్డింగ్ లను తొలగించడం, విరిగిపడిన చెట్లను త్వరితగతిన తొలగించి ఆయా ప్రదేశాలలో ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా విజయవాడ నగరంలో అక్కడక్కడా పొంగిన వాగుల వద్ద, కాలువల వద్ద, పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసి ప్రజలు ఎవ్వరూ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నదులు, కాలువలు, వాగుల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను పరిశీలిస్తున్నారు. తక్షణమే అవసరమైన సూచనలు సలహాలను సిపి రాజశేఖర్ బాబు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సిబ్బందికి ఇస్తున్నారు.

