పానీ పూరి నిషేదం అక్కర్లేదు…

- చిరు వ్యాపారులపై టార్గెట్ కాదు
- ట్యాంకులకు మూతలు పెట్టండి
- రిజర్వాయర్లను ఆధునీకరిస్తాం
- రూ.15 కోట్లు మంజూరు చేస్తాం
- గంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని ఆకస్మిక తనిఖీ
గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గుంటూరులోని తక్కెళ్లపాడు వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్, స్తంభాలగ రువు వాటర్ ట్యాంక్‌లను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి ఆయన ప్లాంట్‌లో నీటి శుద్ధి ప్రక్రియను సమీక్షించి, ట్రీట్ మెంట్ ప్రక్రియ రికార్డులు, పరికరాల పనితీరును పరిశీలించారు. తరువాత స్తంభాలగరువులోని వాటర్ ట్యాంకులను పరిశీలించిన పెమ్మసాని పాత ట్యాంక్ పై మూత లేకపోవడం, కొత్తగా నిర్మించిన ట్యాంక్‌లో ఇనుప మెష్ దెబ్బతినడం వంటి సమస్యలను గుర్తించారు.
వెంటనే మరమ్మతులు చేయించి పక్షులు లోపలికి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మరమ్మతులను తక్షణమే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్రజారోగ్య సమస్యలపై సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు పరిసర ప్రాంతాల్లో సుమారు 11 లక్షల జనాభా ఉన్నదని, ఇటీవల భారీ వర్షాల కారణంగా డయేరియా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
నగరంలో సేకరించిన 167 నీటి శాంపిల్స్‌లో 21 కలుషితమైనట్లు తేలిందని ఆయన వెల్లడించారు. గుంటూరు ఛానల్ ద్వారా లేదా పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీటి కలుషితం జరగవచ్చని పేర్కొన్నారు. నీటి సమస్యలను పరిష్కరించేందుకు రూ.15 కోట్లతో రిజర్వాయర్ల ఆధునీకరణ చేపడతామని, రిజర్వాయర్ల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వాటర్ ట్యాంకులకు మూతలు లేకపోవడం సమస్యగా మారిందని, వెంటనే వాటిని మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే ట్రీట్ మెంట్ ప్లాంట్లు, వాటర్ ట్యాంకుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రెగ్యులర్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డయేరియా కేసులు చాలా వరకు తగ్గిపోయాయని, ఎలాంటి ప్రాణాపాయం లేదని మంత్రి ధైర్యం కల్పించారు. పానీపూరి బండ్లు లేదా చిన్న వ్యాపారాలను మూసివేయాల్సిన అవసరం లేదని, కానీ ప్రజలకు శుద్ధమైన నీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నీటి శుభ్రత కోసం సీనియర్ సిటిజన్ల సహకారంతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామని కూడా పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు (నాని), జాయింట్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాత్సవ, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జి.ఎం.సి కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


