తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : వైఎస్సార్ ప్రభుత్వం అయిదేళ్ల పాలనలో నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని, పలురకాల దోపిడీలతో ప్రభుత్వాన్ని నాశనం చేస్తే తమ ప్రభుత్వం పటిష్టమైన, పారదర్శక విధానాలతో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేని నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, గనుల, భూగర్భ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావెరి సమావేశ మందిరంలో ఈరోజు ఆయన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం కొల్లు రవీంద్ర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్రంలోని డిస్టిలరీల నుండి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకుని కొత్త పాలసీ పేరుతో వ్యవస్థ మొత్తాన్ని విచ్చిన్నం చేశారన్నారు. ఎన్ ఫోర్సు మెంట్ లేకుండా చేసి మద్యం అక్రమ వ్యాపారాలకు తెరలేపడమే కాక మల్టీ నేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని మార్కెట్ నుంచి దూరం చేసి, తమ సొంత బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్ది వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీశారన్నారు.
ఫలితంగా గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంతో ప్రభుత్వ ఆదాయం.. ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీని అధ్యయనం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టామని, అత్యంత పారదర్శకంగా డిప్ నిర్వహించి మద్యం షాపుల్ని కేటాయించామని చెప్పారు. పారదర్శక లైసెన్స్ కేటాయింపు కారణంగా సుమారు 90వేల దరఖాస్తులు రాగా, రూ.1800 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
ఏపీలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా పెరిగిందని, సరిహద్దు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పెరగ్గా, మన రాష్ట్రంలో మద్యం ఆదాయం తీవ్రంగా కోల్పోయామన్నారు. తమ ప్రభుత్వం – ప్రజలకు ఆరోగ్యం.. ప్రభుత్వానికి ఆదాయం కాపాడే విధంగా పాలసీని తీసుకొచ్చి 350కి పైగా నాణ్యమైన మద్యం బ్రాండ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇటు బెల్టు షాపులను పూర్తిగా తొలగించి, నవోదయం 2.0 ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టూరిజం పెంపు కోసం 3స్టార్ హోటల్ కి లైసెన్స్ ఫీజు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ఐదేళ్ల అక్రమాల గురించి ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారని అంటూ వారి హయాంలో క్యాష్ అండ్ క్యారీ.. విధానంతో జరిగిన దాదాపు లక్ష కోట్ల లావాదేవీలపై సీఐడీ విచారణ జరుగుతోందన్నారు. అంతకుముందు జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.