MINISTER| టంగుటూరు, ఆంధ్రప్రభ : ప్రపంచ మత్య్సకార దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెం, మల్లవరప్పాడు చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు, ట్యాంకులు, చెరువుల్లో 7లక్షల చేప పిల్లలను వదలనున్నట్టు చెప్పారు. ఈ సంవత్సరంలో వర్షాలు కురవడంతో రిజర్వాయర్లు, ట్యాంకుల్లో పూర్తి స్థాయిలో నీరు చేరిందన్నారు.
చేప పిల్లల పెంపకం వల్ల మత్య్సకార సొసైటీలకు, గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరడంతో పాటు మత్స్యకారుల జీవనోపాధి పెరుగుతుంది అన్నారు. సబ్సిడీతో వలలు, మోటార్ బోట్లు అందజేయడంతో పాటు మత్య్సకారులకు రాష్ట్ర ప్రభుత్వం వేట నిషేధ భృతిని 20వేల రూపాయలు అందిస్తోందన్నారు. వేటకు వెళ్లే మత్య్సకారులకు భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అన్నారు. తుఫాను సమయంలో మత్స్యకారులకు భృతి, నిత్యవసర సరుకులు పంపిణీతో పాటు అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, మత్స్య శాఖ జెడి శ్రీనివాస రావు, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

