Thefts | దొంగల బీభత్సం…..

Thefts | దొంగల బీభత్సం…..

వరుస చోరీలతో వణికిపోతున్న వ్యాపారులు


Thefts | ఘట్ కేసర్, ఆంధ్రప్రభ : మేడ్చల్ జిల్లా (Medchal District) పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ ప్రాంతంలో వరుస దొంగతనాలతో చిరు వ్యాపారుల గుండెల్లో గుబులు రేగుతోంది. కేవలం రెండు రోజుల్లోనే నాలుగు షాపుల్లో చోరీలు జరగడంతో వ్యాపారులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవాళ‌ తెల్లవారుజామున 3:30 నుండి 4 గంటల సమయంలో అన్నోజిగూడలోని శ్రీ మీనాక్షి ట్రేడర్స్ (కిరణ స్టోర్) ను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. షాపు షట్టర్ తాళాలను పగులగొట్టి లోనికి చొరబడిన దొంగలు (Thieves), డబ్బులు, సరుకులను ఎత్తుకెళ్లారు. షాపు యజమాని బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… గళ్ళ పేటలో ఉన్న రూ.8000 నగదుతో పాటు సబ్బులు, ఇతర సరుకులను అపహరించారు. ఉదయం షాపు తెరవడానికి వచ్చిన యజమాని బాలకృష్ణ, తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల (police) విచారణలో, మీనాక్షి ట్రేడర్స్ ఒక్కటే కాదని, గత రెండు రోజుల్లో క్రితం తన షాపు పక్కన ఉన్న ప్రకాష్ స్వీట్ హౌస్, జై సేవాలాల్ మహారాజ్ మొబైల్ షాప్ షాపుల్లో కూడా దొంగతనాలు జ‌రిగాయ‌ని బాలకృష్ణ వివరించారు. ఇదే కాకుండా శనివారం రాత్రి ఒక టీ షాప్, దాని సమీపంలోని ఒక కిరాణా జనరల్ స్టోర్ లో కూడా చోరీలు జరిగాయి. వరస దొంగతనాలతో రాత్రి సమయంలో షాపులకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాలంటే భయంతో బిక్కుబిక్కుమంటున్నామని వ్యాపారులు తెలిపారు.


వరుస దొంగతనాలపై కేసు నమోదు చేసుకున్న పోచారం (Pocharam) ఐటీసీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ, దొంగలను త్వరగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ దొంగతనాల వెనుక ఒకే ముఠా హస్తం ఉందా, లేదా ఏమన్నా గ్రూపులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply