ప్రస్తుతం సమాజాన్ని గంజాయి వంటి మాదక ద్రవ్యాలు పట్టిపీడిస్తున్నాయి. యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతూ బతుకును చిత్తు చేసుకుంటున్నారు. బాధితుల్లో ఉన్నత విద్యావంతులు, వైద్య విద్యార్థులు(medical students) వంటి వారు ఉంటుండటం మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం. వైద్యో నారాయణో హరి అన్నారు..! అంటే వైద్యుడు దేవుడితో సమానం. సమాజంలో డాక్టర్‌కు అంతటి హోదానిచ్చాం మనం. కానీ వరుస ఘటనలు వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. భవిష్యత్తులో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు, ఇలాంటి వ్యసనాలకు బానిసలవుతుండటం తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. స్టెతస్కోప్ పట్టాల్సిన డాక్టర్లు.. మత్తుకు చిత్తవుతున్నారు…! రోల్ మోడల్స్( role models)గా ఉండాల్సినవాళ్లు.. డ్రగ్ అడిక్ట్లుగా మారుతున్నారు.
- ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
లేటెస్ట్‌గా హైదరాబాద్‌లోని రిసాలబజార్ కేంద్రంగా సాగుతున్న మత్తు దందాను తెలంగాణ ‘ఈగల్’ పోలీసులు(Telangana ‘Eagle’ police) ఛేదించారు. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిలో ఇద్దరు పెడ్లర్లతో పాటు 81 మంది వినియోగదారులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల్లో నగరంలోని ఓ వైద్య కళాశాల(medical college
) కు చెందిన కొంతమంది వైద్య విద్యార్థులు ఉన్నారు. కొందరిని పరీక్షించగా పాజిటివ్‌గా తేలడం, వారిలో ఇద్దరు యువతులు ఉండటం గమనార్హం.
ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ విద్యార్ధులను టార్గెట్‌గా…
సికింద్రాబాద్ బొల్లారం రిసాల బజార్‌కు చెందిన అరాఫత్ అహ్మద్ ఖాన్(23) డ్రగ్స్, గంజాయికి బానిసయ్యాడు. కర్నాటకలోని బీదర్‌కు చెందిన జరీనా భాను(46) అనే మహిళ వద్ద కిలోల కొద్దీ గంజాయి కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు తరలించి కస్టమర్లకు సప్లయ్ చేసేవాడు. సిటీ శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ విద్యార్ధులను టార్గెట్ చేశాడు. లిక్కర్సహా మాదకద్రవ్యాల మత్తుకు బానిసలైన స్టూడెంట్స్‌కు మొదట్లో తక్కువ ధరకు గంజాయిని అందించాడు. ఇలా చైన్ సిస్టమ్‌తో స్టూడెంట్స్ కస్టమర్ల నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. గంజాయి కొనుగోలు, అమ్మకాలకు గూగుల్ పే, ఫోన్‌పేలను వినియోగించాడు. అరాఫత్ గంజాయి దందాలో వివిధ కాలేజీలు, ప్రైవేట్ హాస్టల్స్ విద్యార్ధులు కస్టమర్లుగా ఉన్నారు.
ఎలా పట్టుకున్నారంటే..?
హైదరాబాద్‌లోని బొల్లారం రిసాలబజార్‌లోని పాఠశాల మైదానానికి తరచుగా ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై అక్కడి వినియోగదారులకు గంజాయి అమ్ముతున్నట్లు హైదరాబాద్ ఈగల్ విభాగానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడ పోలీసులు వారి కోసం మాటువేశారు. ఈ క్రమంలోనే ఓ బైక్‌పై అనుమానాస్పదంగా వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అతడి వద్ద 2 కిలోల గంజాయి దొరికింది. నిందితుడిని రిసాలబజార్‌కు చెందిన అరాఫత్ అహ్మద్ ఖాన్ (23)గా గుర్తించారు.
బీదర్ నుంచి గంజాయి తెచ్చి…
ఇతడు రెండు సంవత్సరాలుగా కర్ణాటకలోని బీదర్‌లో జరీనా బాను వద్ద గంజాయి కొని నగరంలో అమ్ముతున్నట్లు తేలింది. అరాఫత్ అహ్మద్ ఖాన్ ఇచ్చిన సమాచారంతో ఈగల్ బృందాలు జరీనా బానును ఇటీవల బీదర్‌లో అదుపులోకి తీసుకున్నాయి. ఆమె బ్యాంకు అకౌంట్‌ను పరిశీలించగా, సంవత్సరం కాలంగా జరిగిన రూ.1.5 కోట్ల లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో రూ.26 లక్షలు హైదరాబాద్‌కు చెందిన 51 మంది గంజాయి వ్యాపారులు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్‌లో నమోదైన రెండు గంజాయి కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉంది. ఆమె వద్ద అరాఫత్‌ఖాన్ రూ.6 లక్షల లావాదేవీలు జరిపాడు.
ఓ వైద్య కళాశాలకు చెందిన 32 మంది విద్యార్థులు
అరాఫత్ అహ్మద్ ఖాన్ వద్ద దాదాపు 100 మంది గంజాయి కొంటున్నట్లు ఈగల్ డీఎస్పీ నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు విచారణలో గుర్తించారు. ఇందులో ఓ వైద్య కళాశాలకు చెందిన 32 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 24 మందిని పరీక్షించగా ఇద్దరు యువతులు సహా 9 మందికి పాజిటివ్ వచ్చింది. వీరంతా కళాశాల వసతి గృహంలో ఉంటున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి డీ-అడిక్షన్ కేంద్రానికి పంపించారు. మిగిలిన 8 మంది గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.