తొలి మహిళ ప్రధానికి ప్రపంచం సాహో

సవాళ్లు సరే సరి
(వురిటి రమాకాంత్, సీనియర్ జర్నలిస్ట్)
: అది అవనిలో తొలి పొద్దు పొడిచే దేశం. ప్రపంచంలో ఓ చిన్న దేశం. రెండవ ప్రపంచ యుద్ధం సాక్షిగా.. అణుబాంబు దాడిలో సర్వం ధ్వంసమైన దేశమది. ఇక ఆ దేశం కోలుకోవటం అసాధ్యమని ప్రపంచ దేశాలు భావించాయి. అగ్రరాజ్యాలు నవ్వుకున్నాయి. అవమానించాయి. కానీ.. ఈ దేశం సాంకేతికంగా.. ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తోంది. అదే జపాన్. సామాన్యుడి చేతిలో టెక్నాలజీ దిగ్గజం. 80 ఏళ్లల్లోనే అభివృద్ధికి చిరునామాగా మారిన ఈ జపాన్ ప్రగతి బాటలో శ్రమైక సౌందర్యం ఎవరిది? జపాన్ మహిళదే. అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. లాంగ్ అవర్స్.. ఓవర్‌ వర్క్ కల్చరే జపనీయుల పెట్టుబడి కాగా.. ఉత్పత్తి కారకుల్లో మహిళలదే అగ్రస్థానం. ప్రపంచంలోనే అత్యున్నత విద్యావేత్తలుగా వెలిగే.. జపానీ మహిళలు రాజకీయ సాధికారితలో .. ప్రపంచంలోనే అట్టడుగు స్థాయిలో ఉన్నారు. దేశాధినేత పదవిపై ఇక్కడి మహిళలకు ఆశ లేదు. ఎందుకంటే ఇక్కడి సమాజంలో పురుషాధిక్యత సన్నగిల్లలేదు. కానీ.. ఓ ఉక్కు మహిళ.. శివగామి అవతారం ఎత్తింది. మగాళ్ల చేతిలోని అధికారాన్ని ఆలవోకగా అందుకుంది. ఆమె.. ఎవరో కాదు స్వేచ్ఛ ప్రజాస్వామిక వాది. లిబరల్ డెమెక్రటిక్ పార్టీ నేత స‌నాయె త‌కాయిచి జపాన్ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. జపాన్ తొలి మహిళ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఎల్ డీపీ నేత సనాయెకు అడ్డంకులు తప్పలేదు. ఈమె ప్రధాని కావటం మిత్రపక్షానికి అసలు ఇష్టం లేదు. ఆడది ప్రధాని కావటాన్ని ఇక్కడ మగ మహారాజులు తట్టుకోలేరు. మిత్రభేదంతో నీరసపడే స్థితిలో.. ప్రపిపక్షం ఆమెకు ప్రధాని హారం వేసింది. 64 ఏళ్ల ప్రాయంలో ఆమె దిగువ స‌భ‌లో స్పష్టమైన మెజారిటీని సాధించారు. ఎల్‌డీపీ (LDP) దీర్ఘకాల సంకీర్ణ భాగస్వామి కొమైటో పార్టీ తన మద్దతును ఉపసంహరించుకోవటంతో ఆమెకు ప్రధాని పదవికి మార్గం మూసుకుపోయినట్లు కనిపించింది. కానీ చివరి నిమిషంలో మరొక ప్రతిపక్ష పార్టీ జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (JIP)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పార్టీ మ‌ద్దతుతో ఆమె ప్రధాని మంత్రిగా అయ్యారు. ఆమెకు నేషనల్ డైట్ (National Diet) (కొక్కై (Kokkai))లో దిగువ స‌భ (షోగిన్ (Shūgiin))లో 465 మంది స‌భ్యులు ఉండ‌గా 237 ఓట్లు, కౌన్సిలర్ల సభ (సంగిన్ (Sangiin)) లో 248 స‌భ్యులు ఉండ‌గా 125 ఓట్లు పొందారు. దీంతోపాటు ఆమెకు జేఐపీకి చెందిన 35 మంది మ‌ద్దుతు ఇవ్వడంతో ప్రధాని మంత్రి అయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సనాయె తకాయిచి జపాన్ తొలి మహిళా ప్రధానిగా గౌరవం దక్కించుకున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ దాచర్‌కు వీరాభిమాని అయిన తకాయిచి జపాన్ రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరు పొందారు. ప్రధానమంత్రిగా ఎన్నిక కావడానికి ఆమె చేసిన మూడో ప్రయత్నం సఫలం కావడం గమనార్హం. ఆమె గడచిన ఐదేళ్లలో జపాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన నాలుగో వ్యక్తి. లిబరల్ డెమోక్రటిక్ సంప్రదాయ అతివాద ధోరణికి ప్రతినిధిగా ప్రసిద్ధురాలైన తకాయిచి మాజీ ప్రధాని షింజో అబె అనుచ‌రాలు.

ప్రధాన మంత్రి త‌కాయిచికి జ‌పాన్ రాజ‌కీయాలు కొత్తకాదు. తన రాజ‌కీయ కెరీర్‌లో అనేక మంత్రి పదవులను నిర్వహించారు. గతంలో ప్రధానమంత్రి పదవికి పోటీ చేశారు. మధ్యంతర ఎన్నికల్లో భారీ పరాజయాల తర్వాత ఎల్‌డీపీ ( LDP) మాజీ నాయకురాలు, ప్రధానమంత్రి షిగెరు ఇషిబా రాజీనామా చేసిన తర్వాత ఆమె ఎన్నికయ్యారు. థాచర్‌ను ఆరాధించడం ద్వారా “ఐరన్ లేడీ” అని ఆమెను పిలిచేవారు. స్వలింగ వివాహానికి ఆమె వ్యతిరేకత. వివాహిత మహిళలు తమ తొలి ఇంటిపేర్లను ఉంచుకోవడానికి అనుమతించాలనే డిమాండ్ పెరగడం వంటి సంప్రదాయవాద అభిప్రాయాలను తెర‌పైకి తెచ్చిన మ‌హిళ‌. ఆమె జపాన్ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, ఇది మహిళా సాధికారతకు గొప్ప అవకాశం అని ప‌లువురు విద్యార్థులు ప్రశంసిస్తున్నారు.

జపాన్ ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం ప్రధానమంత్రిగా స‌నాయె త‌కాయిచి ముందున్న అతిపెద్ద సవాలు. ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఇది అనిశ్చిత సమయం. జపాన్ లో పెరుగుతున్న జీవన వ్యయం, నిరాశ చెందిన ప్రజలతో పోరాడుతున్నందున, సవాలుతో కూడిన ఆర్థిక సమయంలో తకైచి బాధ్యతలు స్వీకరించారు. జ‌పాన్‌లో ఆర్థిక రంగాన్ని పున‌రుద్ధించ‌డం త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం.

దేశీయ సవాళ్లతో పాటు, విదేశాలతో ఉన్న సంక్లిష్టమైన సంబంధాలను కూడా త‌కాయిచి చ‌క్కదిద్దాలి. జపాన్‌తో చారిత్రాత్మక.. సున్నిత సంబంధాలను చక్కదిద్దుకునేందుకు దక్షిణ కొరియా పావులు కదుపుతోంది, దివంగత మాజీ ప్రధాని షింజో అబేతో సహా ఆమె పూర్వీకులలో కొంత మందిలాగే ఆమెను చైనా వ్యతిరేకిగా చూస్తారు. అమెరికాతో సంబంధాలు ఒక ప‌రీక్ష లాంటిదే. వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కూడా జ‌రుగునుంది. రెండు వైపులా సుంకాల ఒప్పందానికి చేరుకున్నప్పటికీ, ట్రంప్ గతంలో తమ మధ్య భద్రతా ఒప్పందం విలువను ప్రశ్నించడం, టోక్యో రక్షణ కోసం ఎక్కువ చెల్లించాలని డిమాండ్ చేయడం జ‌పాన్‌కు ఆందోళనలను రేకెత్తించాయి. త‌కాయిచి ఈ సమస్యలను అధిగ‌మించేలా అమెరికాతో సంబ‌ధాలు మెరుగుప‌రుచుకోవాలి.

జపాన్ రాజకీయాల్లో మహిళల ప్రాముఖ్యం చాలా తక్కువ. ఇది ప్రపంచంలోనే అతి హీన ర్యాంకులలో జపాన్ కూడా ఒకటి. 2025లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం, జపాన్ 148 దేశాలలో 118వ స్థానంలో ఉంది, ముఖ్యంగా పాలిటికల్ ఎంపవర్‌మెంట్ విషయంలో 8.5 శాతానికి పడిపోయింది. జీ7 దేశాలలో ఆఖరి స్థానంలో నిలిచింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సైతం మహిళలను తక్కువగా ప్రోత్సహిస్తున్నాయి, సాంప్రదాయంగా హౌస్ వైఫ్ పాత్రమే జసాన్ మహిళలు స్థిరపడిపోయారు. రాజకీయాలకు చాలా దూరంలో ఉన్నారు. జపాన్ లోయర్ హౌస్ లో మహిళలు 9.9 శాతం నుండి 16.1 శాతం సీట్లు పెరిగాయి. 2024 ఎన్నికల్లో 15.7%కి చేరింది. జూలై 2025 ఎన్నికల తర్వాత అప్పర్ హౌన్ లో దాదాపు 30% మహిళలు ఉన్నారు. మునుపటి ఇషిబా ప్రభుత్వంలో మంత్రి వర్గంలో మహిళలు మంత్రులు సంఖ్య 25శాతం నుంచి పది శాతానికి పడిపోయింది. 2025 అక్టోబర్ 21న జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయే తకాయిచి మంత్రి వర్గంలో ఇద్దరే మహిళలకు స్థానం లభించింది. ఇది చరిత్రాత్మకం, కానీ ఆమె కన్జర్వేటివ్ దృక్పథం (మహిళలకు మంత్రి పదవులకు వ్యతిరేకం) కారణంగా మహిళల సాధికారతకు పెద్ద మార్పు రాకపోవచ్చని విమర్శకులు అంటున్నారు.

Leave a Reply