NTR | పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

NTR | పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- కృష్ణా జిల్లావ్యాప్తంగా 2.30 లక్షల మందికి పింఛన్లు
- మచిలీపట్నంలో పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి రవీంద్ర
NTR | కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు మచిలీపట్నంలోని 16వ డివిజన్‌లో నిర్వహించారు. లబ్ధిదారులకు మంత్రి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి ఎన్టీఆర్ (NTR) భరోసా పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ప్రతీ నెల రూ.2730 కోట్లు ఖర్చు చేస్తున్నామని, సంవత్సరానికి రూ.35 వేల కోట్లు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 2.30 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్ పొందుతున్నారని తెలిపారు.

బెడ్ రీడర్లకు రూ.15 వేలు, కిడ్నీ పేషంట్లకు రూ.10 వేలు, వృద్ధులకు రూ. 4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు పింఛన్ అందిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన రాష్ట్రంలోనే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కర్నాటక, తమిళనాడు, ఒడిశా రూ.వెయ్యిలోపే అందిస్తుండగా, హర్యారా కూడా రూ.2 వేల పింఛన్ (Pension) అతి తక్కువ మందికి ఇస్తుందని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుమీ ఉచిత గ్యాస్ సిలెండర్లు, గృహనిర్మాణానికి 2.50 లక్షలతోపాటు పావలా వడ్డీకి రుణాలు కూడా ఇస్తున్నామని తెలిపారు. మొత్తం 5 లక్షల ప్రభుత్వ సాయంతో గృహనిర్మాణాలు చేసుకునే అవకాశం పేదలకు అందిస్తున్న ప్రభుత్వం మాదేనని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన ఇంచార్జ్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, బీజేపీ ఇన్‌చార్జ్ సోడిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

