యాదగిరి కొండ , ఆంధ్రప్రభ : కెనడా రాజధాని నగరం ఒట్టావాలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ- కెనడా అసోసియేషన్ (టిసిఏ) ఆహ్వానం మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణ వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులతో యాదగిరిగుట్ట ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. వెంకట్రావు ఆధ్వర్యంలో ఆలయ ఏఈఓ గజవెల్లి రఘు, రిటైర్డ్ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహ చార్యులు ఈ కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ వేడుకలో హిందూ ధర్మ ప్రచారకులు, మాజీ ఎంపీ చంద్ర ఆర్య, కరుణాకర్ రెడ్డి పాపల, తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం ప్రత్యేక అతిథులుగా పాల్గొని స్వామివారికి మొక్కులను చెల్లించారు.
ఒట్టావాలో భక్తుల సందడి..

కెనడాలో నివసిస్తున్న తెలుగువారు, ప్రవాస భారతీయ పెద్ద సంఖ్యలో ఈ కల్యాణోత్సవానికి హాజరయ్యారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగారు. భక్తుల జయజయధ్వానాల మధ్య, వేద మంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం అందరికీ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో కూడా కొనసాగించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహించి, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికి తమ మూలాలను గుర్తు చేసేలా ప్రయత్నిస్తామని వారు చెప్పారు.

