దేవాలయం అంటేనే దేవుడు లేదా దేవత ఉండే ప్రదేశం. కనుక దేవాలయం అని పిలుస్తున్నాము. మత సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు ఉపయోగించే ఒక కట్టడం. పవిత్ర ప్రదేశం. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలూ, కట్టిన తీరూ, విధానాలు మనకు కనబడుతాయి. శ్రీ వైఖానస శాస్త్రం ప్రకారం భగవంతుడు అర్చా రూపంలో భక్తుల కోసంగా భూలోకానికి వచ్చాడని చెబుతారు. మీరు గమనిస్తే ప్రతి దేవాలయంలోనూ ద్వారపాలకులూ, పరివార దేవతలు, ప్రాకార దేవతలు వారివారి స్నానాలలో మనకు దర్శనమిస్తారు. ఈ దేవాలయాలు ఆయా దేశ చరిత్రలు అవగాహాన చేసేందుకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ ఆలయాలు అయిదు రకాలుగా మనకు కనిపిస్తాయి. స్వయం వ్యక్తస్థలాలు, దివ్య స్థలాలు, సిద్ధ స్థలాలు, పౌరాణిక స్థలాలు, మానుస స్థలాలుగా చెప్పబడ్డాయి. భగవంతుడే స్వయంగా వెలసినవి, దేవతలచే ప్రతిష్టింపబడినవి, మహర్షులూ, సిద్ధులూ తపస్సు చేసి, సిద్ధి పొంది వారు ప్రతిష్టించినవి, పురాణాల్లో చెప్పబడినవి, ఇక రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ట చేయబడినవి. ఆలయానికి గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వార పాలకులు, వంటశాల వంటి విభాగాలుంటాయి. శివుడి విగ్రహాలు, లింగాలు వుండేవి శివాలయాలు. విష్ణు అంశతో ఉండేవి విష్ణాలయాలు. శ్రీరాముడు స్థాపించబడిన దేవాలయాలు రామాలయాలు, సూర్యనారాయణమూర్తి వుండేవి సూర్యాలయాలు, సుబహ్మణ్య స్వామి స్థాపించబడిన దేవాలయాలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు వేంకటేశ్వరుడు స్థాపించబడిన దేవాలయాలు వేంకటేశ్వర ఆలయాలు. ఆలయాల్లోకి వాహనం మీదగాని, పాదరక్షలతో గానీ రాకూడదు. ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళాలి. ఆలయంలోకి తలపాగా ధరించి గానీ, చేతిలో ఆయుధంతో గానీ రారాదు. ఉత్త చేతులతో వెళ్ళకూడదు. తిలకం ధరించాలి. తాంబూలం చర్వణం చేస్తూగానీ, ఆహారదులు తింటూగానీ లోపలికి రాకూడదు. ఆలయ ప్రాంగణంలో మలమూత్ర విసర్జన చేయరాదు. ఆలయం ముందు కాళ్ళు చాపుకుని కూర్చోరాదు. ఎవ్వరికీ దు:ఖం కలిగించే పనిచేయరాదు. హింస పనికిరాదు. వివాదాలు కూడదు. అహంకారం, గర్వం, అధికార దర్పం కూడదు. పరస్తుతి, పరనింద పనికిరాదు. దేవుని ఎదుట వృష్టభాగం చూపిస్తూ కూర్చోరాదు. అధికార గర్వంతో అకాలంలో ప్రవేశించి, అకాల సేవలు చేయకూడదు. ఒక చేత్తో నమస్కారం చేయరాదు. ఆలయాల్లో ఆ దేవుడే అంతాను. ఇతరులకు నమస్కారం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే.
- డా||పులివర్తి కృష్ణమూర్తి