ఆదివారం కిక్కిరిసిన ఆలయం

ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి/యాదగిరిగుట్ట : ​యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ సెలవు కావడంతో యాదాద్రి గిరిపైన భక్తజన సంద్రం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.

ఆదివారం భక్తుల ర‌ద్దీ ఊహించని విధంగా పెరగడంతో అన్ని క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో, స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు గంట సమయం పట్టింది. ఇక‌ ప్రత్యేక దర్శనానికి అరగంటకు పైగా సమయం పట్టింది. పోలీసులు, ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

అయినప్పటికీ, భ‌క్తుల ర‌ద్దీని నియంత్రించడం కష్టంగా మారింది. ఆలయంలోని అన్ని ప్రాంగణాలు భక్తులతో నిండిపోయాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ప్రసాదం విక్రయశాల వద్ద, సత్యనారాయణ స్వామి వ్రత మండపం వద్ద భక్తుల సందడి నెలకొంది.

అదేవిధంగా కొండ దిగువన ఉన్న విష్ణు పుష్కరణి, కార్ పార్కింగ్ స్థలాలు, బస్ స్టాండ్‌లు కూడా భక్తులతో నిండిపోయాయి. స్వామివారి కల్యాణకట్ట వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తలనీలాలు సమర్పించుకున్నారు.

భక్తుల రద్దీ పెరగడంతో ఆలయానికి ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తర్వాత ఆలయం రోజురోజుకు మరింత ఆకర్షణీయంగా మారి, భక్తులను ఆకట్టుకుంటుంది.

ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply