- ఓ దళిత బాలికపై గ్యాంగ్ రేప్
- మరో జంట నిలువు దోపిడీ
- ఆ ముగ్గురే కీచకులు
- నిందితుల కోసం పోలీసులు జల్లెడ
- చిత్తూరులో కలకలం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో; చిత్తూరులో దళిత మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. ఆ బాలికను ఒకరి తర్వాత ఒకరు సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళ్తే చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలోని నగర వనం లో ప్రేమికులు, సామాన్య ప్రజలు సేద తీరుతుంటారు. అందులోనూ వారాంతంలో వీరి తాకిడి ఎక్కువ ఉంటుంది.
ఈ క్రమంలో ఈనెల 26 న శనివారం ఓ ప్రేమికుల జంట కూర్చొని మాట్లాడుతుండగా హేమంత్, మహేష్, కిషోర్ అనే ముగ్గురు యువకులు తమను ఫారెస్ట్ సిబ్బందిగా పరిచయం చేసుకొని, ఆ ప్రేమ జంటను వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించారు. తరువాత ఆ ముగ్గురులో ఒకరు ప్రేమజంట అబ్బాయిని మా మేడమ్ మిమ్మల్ని పిలుచుకురమ్మాన్నారని దూరంగా తీసుకు వెళ్లగా మరో ఇద్దరు ఆ మైనర్ బాలిక పై అత్యాచారానికి ఒడిగట్టారు.
ఆ అమ్మాయి కేకలు వేయగా ఒకడు నోరు నొక్కి పట్టుకోగా , మరొకరు అత్యాచారం చేసాడు. ఇలా ముగ్గురు మార్చి మార్చి ఆ బాలికను రేప్ కు గురి చేసారు. ఈ విషయం బాలిక సొంత ఊరు బండపల్లిలోని గ్రామస్తులకు తెలిసింది. నగరవనం దగ్గర కాపు కాశారు. సోమవారం మధ్యాహ్నం ఆ కామాంధులను గుర్తించిన బండపల్లి గ్రామస్థులు ఆ ముగ్గురికి దేహశుద్ధి చేయగా ఒకడు తప్పించుకొని పారిపోయాడు. మిగిలిన ఇద్దరిని చిత్తూరు తాలూకా పోలీసులకు అప్పగించారు.
ఎవ్వరినీ వదలం.. చిత్తూరు డీఎస్సీ సాయినాథ్
చిత్తూరు మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు చిత్తూరు నగర డీఎస్పీ సాయినాథ్ మంగళవారం సాయంత్రం చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తప్పు చేసిన వారెవరైనా చట్టం ముందు అందరూ సమానులేనని, పార్టీలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా చిత్తూరు జిల్లా పోలీసులు పారదర్శకతతో తమ విధులను నిర్వహిస్తారని ఆయన అన్నారు.
నిందితులపై పోక్సో కేసు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ నెల 25వ తేదీన మురకంబట్టులోని నగరవనం పార్క్ లో ఒంటరిగా ఉన్న ప్రేమజంటపై కొందరు వ్యక్తులు దాడి చేసి, వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకొని గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయమై బాధిత ప్రేమజంటలో యువకుడు 29వ తేదీన చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తాలూకా ఎస్.ఐ. మల్లికార్జున కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఫిర్యాదుదారుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మళ్లీ విచారణ జరిపినప్పుడు అతను ముగ్గురు వ్యక్తులు వచ్చి తనను బెదిరించి, తనతోపాటు ఉన్న బాలికపై అత్యాచారం చేశారని పోలీసులకు తెలిపాడని, దీనిని ఆధారంగా పోలీసులు బాధితురాలి వివరాలు సేకరించి, ఆమె నివాసానికి వెళ్లి బాధితురాలు ఆమె తల్లిదండ్రులతో చర్చించారని ఆయన వివరించారు. మొదట్లో ఫిర్యాదు చేయడానికి నిరాకరించినప్పటికీ, పోలీసులు ధైర్యం చెబుతూ కౌన్సిలింగ్ నిర్వహించగా బాధితురాలు ముందుకు వచ్చి, అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్ కు తీసుకువెళ్లి, చట్ట ప్రకారం మహిళా అధికారి ద్వారా బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు ఆయన తెలిపారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డీఎస్సీ సాయినాథ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, పరారీలోని నిందితులు మహేష్ కిశోర్, హేమంత్ ప్రసాద్ ను గుర్తించామన్నారు .వీరిని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించామని , త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు.ఈ కేసులో పోలీసులు ఎటువంటి అలసత్వం లేకుండా, పక్షపాతం లేకుండా, పూర్తి పారదర్శకతతో , కఠినంగా దర్యాప్తు చేస్తున్నారని, మీడియా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం లేదా వాస్తవాలను వక్రీకరించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తప్పు చేసిన వారెవరైనా చట్టం ముందు అందరూ సమానులేనని, పార్టీలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా చిత్తూరు జిల్లా పోలీసులు నిష్పక్షపాతంగా పారదర్శకతతో తమ విధులను నిర్వర్తిస్తున్నామని డి.ఎస్.పి సాయినాథ్ తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీతో పాటుగా చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర, వెస్ట్ సర్కిల్ ఇన్ఫెక్టర్ శ్రీధర్ నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.
