పాల్గొన్న కమిషనర్ రామచంద్ర మోహన్…
రేపటి నుండి ద్వాదశ ప్రదక్షిణలు పవళింపు సేవలు..
( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసాయి. ఈనెల 24వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ మల్లేశ్వర స్వామివార్లకు ప్రతిరోజు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు, రుద్రాభిషేకాలు వంటివి నిర్వహించారు. మహాశివరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి ఆలయంలో మండపారాధన, కలసారాధన, మూలమంత్ర హావనములు, హారతి మంత్రపుష్పాలు తీర్థప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
అనంతరం యాగశాలలో మహా శివరాత్రి ఉత్సవ పూర్ణాహుతి ధాన్యకోట్నోత్సవం వసంతోత్సవంను నిర్వహించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.రామచంద్ర మోహన్, స్థానాచార్య వి.శివ ప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం శివాలయం నుండి దేవతామూర్తులతో దుర్గా ఘాట్ చేరి, పవిత్ర కృష్ణానదిలో అవభృతోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
రేపటి నుండి ద్వాదశ సేవలు…
ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో రేపటి నుండి ద్వాదశ సేవా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మార్చి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు రాత్రి 7గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలను నిర్వహించనున్నారు.
