AP | అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలి..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, వేగం, పారదర్శకతే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రెవెన్యూ, సర్వే, హౌసింగ్ మరియు పిజిఆర్ఎస్ అంశాలపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిజిఆర్ఎస్ లో నమోదయ్యే ప్రతి అర్జీని గడువు లోపు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం కార్యాలయం నుండి పిజిఆర్ఎస్ పరిష్కారాలపై ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. అధికారులు ప్రతిరోజూ లాగిన్ అయి పెండింగ్ అర్జీలను ఎట్ టూ వ్యూ లేకుండా పరిష్కరించాల్సిందిగా సూచించారు.
అర్జీలు సమయానికి ఓపెన్ చేసి నాణ్యతతో పరిష్కరించాలనీ, గడువు దాటిన తర్వాత హడావిడి పరిష్కారం చేయడం వల్ల రీ ఓపెన్ కేసులు పెరుగుతున్నాయని, ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం జరగకూడదని హెచ్చరించారు. రీ ఓపెన్ శాతం సున్నా ఉండాలి, ఇంప్రాపర్ రెడ్రెస్సల్ లు జరగరాదు అని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి, స్వయంగా ఎండార్స్మెంట్లు పంపే విధానాన్ని కచ్చితంగా పాటించాలన్నారు.
కలెక్టర్ వివరించిన ప్రకారం, తుగ్గలి తహసీల్దార్ వద్ద రెండు, అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే) కర్నూలు వద్ద ఒకటి, కల్లూరు, వెల్దుర్తి మండల సర్వేయర్ల వద్ద ఒక్కొక్కటి, కోడుమూరు తహసీల్దార్ వద్ద ఒక ఎట్ టూ వ్యూ అర్జీ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. రెవెన్యూ, సర్వే విభాగాల్లో పెండింగ్ అర్జీలు లేకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు.
హౌసింగ్ దరఖాస్తుల విషయానికి వస్తే, ఆదోని మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువ అప్లికేషన్లు వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ సమన్వయంతో వీటిని త్వరితగతిన వెరిఫై చేయాలని ఆదేశించారు. అలాగే కౌతాళం, హోళగుంద, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల్లో గడువు దాటి ఉన్న దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించాలని సూచించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పత్తికొండ, పాణ్యం, ఆలూరు, మంత్రాలయం, ఆదోని, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ, కర్నూలు నియోజకవర్గం వెనుకబడిందని పేర్కొన్నారు. బి.ఎల్.ఓ ల వారీగా సమీక్షించి, మ్యాపింగ్ పనులు వేగవంతం చేయాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డి.ఆర్.ఓ సి. వెంకట నారాయణమ్మ, ఆర్డీవోలు సందీప్ కుమార్ (కర్నూలు), భరత్ నాయక్ (పత్తికొండ), అజయ్ కుమార్ (ఆదోని), మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి దీప్తి తదితరులు పాల్గొన్నారు.

